Pawar vs Pawar: బారామతిలో మళ్లీ పవార్‌ Vs పవార్‌.. ఈసారి ఎవరంటే..?

Pawar vs Pawar: మహారాష్ట్రలోని బారామతి మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. ఇక్కడ మళ్లీ పవార్‌ కుటుంబసభ్యులు ముఖాముఖీ తలపడనున్నట్లు తెలుస్తోంది.

Published : 14 Jun 2024 15:42 IST

ముంబయి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర (Maharashtra)లోని బారామతి (Baramati) నియోజకవర్గ పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ కుటుంబానికి చెందిన వదినా మరదళ్ల సమరంలో వదిన సునేతా పవార్‌పై మరదలు, సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే విజయం సాధించారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో మరోసారి ‘పవార్‌ వర్సెస్‌ పవార్‌ (Pawar vs Pawar)’ పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయి.

బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి ఈ స్థానంలో వరుసగా గెలుస్తున్న అజిత్‌కు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ తప్పేలా లేదు. ఇక్కడినుంచి పవార్‌ కుటుంబానికి చెందిన మరో నేత యుగేంద్ర పవార్‌ను బరిలోకి దించాలని శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ భావిస్తోంది.

అజిత్‌ సొంత తమ్ముడు శ్రీనివాస్‌ కుమారుడే యుగేంద్ర (Yugendra Pawar). అజిత్‌ తిరుగుబాటుతో ఎన్సీపీ పార్టీ రెండు ముక్కలైన తర్వాత యుగేంద్ర.. శరద్‌ పవార్‌ వెంటే ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ శరద్‌ కుమార్తె సుప్రియా తరఫున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా శరద్‌ పవార్‌ బారామతి పర్యటనలోనూ యుగేంద్ర ఆయన వెన్నంటే ఉన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ‘యువ పవార్‌’ను పోటీలో నిలబెట్టాలని శరద్‌ వర్గం భావిస్తోంది.

వయనాడ్‌ను వదులుకోనున్న రాహుల్‌.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?

‘బారామతి’ స్థానం పవార్‌ కుటుంబానికి కంచుకోట. 1967 నుంచి 1990 వరకు ఈ అసెంబ్లీ స్థానానికి శరద్‌ పవార్‌ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1991 నుంచి అజిత్‌ పవార్‌ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్‌ 1.95 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘బారామతి’ లోక్‌సభ స్థానంలో అజిత్‌ సతీమణి సునేత్రా పవార్‌ ఎన్సీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేకు 1.44లక్షల ఓట్లు రాగా.. సునేత్రకు 96వేల ఓట్లు దక్కాయి. ఇలాంటి సమయంలో యుగేంద్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) బరిలోకి దిగితే అజిత్‌కు గట్టి పోటీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు