Kerala: ‘ఆమె నియామకాన్ని పునఃపరిశీలించండి’.. కేరళ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ!

కేరళ ప్రభుత్వానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కన్నూరు విశ్వవిద్యాలయంలో అసొసియేట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యేందుకు ప్రియా వర్గీస్‌కు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనల ప్రకారం తగు బోధనా అనుభవం లేదని కేరళ హైకోర్టు పేర్కొంది.

Published : 18 Nov 2022 01:43 IST

తిరువనంతపురం: కేరళలోని యూనివర్సిటీల్లో నియామకాల విషయంలో అధికార ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కేరళ ప్రభుత్వానికి తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కన్నూరు విశ్వవిద్యాలయంలో అసొసియేట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యేందుకు ప్రియా వర్గీస్‌(Priya Varghese)కు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనల ప్రకారం తగు బోధనా అనుభవం లేదని కేరళ హైకోర్టు(Kerala High Court) పేర్కొంది. వర్గీస్‌ ప్రతిపాదిత నియామకాన్ని సవాల్‌ చేస్తూ.. మెరిట్‌ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జోసెఫ్ స్కారియా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది.

అసొసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం ఎనిమిదేళ్ల బోధనా అనుభవం అవసరమని.. కానీ, ఆమె టీచింగ్ అనుభవం తక్కువగా ఉందని కోర్టు తెలిపింది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించినట్లు గుర్తుచేసింది. యూనివర్సిటీ స్క్రూటినీ కమిటీ ఈ అంశాన్ని ఎందుకు విస్మరించిందని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో.. ఆమె నియామకాన్ని పునఃపరిశీలించాలని కన్నూరు యూనివర్సిటీకి సూచించింది. ఈ మేరకు, అభ్యర్థుల సెలక్షన్‌ ర్యాంకు జాబితాను సవరించిన అనంతరం, నియామకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవచ్చని చెప్పింది.

కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రైవేటు కార్యదర్శి కేకే రాగేశ్‌ భార్యే ప్రియా వర్గీస్‌. అసొసియేట్‌ ప్రొఫెసర్‌గా వర్గీస్ ప్రతిపాదిత నియామకం.. కేరళలో రాజకీయ దుమారం రేపింది. రీసెర్చ్‌లో ఆమెకు తక్కువ మార్కులే వచ్చాయి. కానీ.. ఇంటర్వ్యూలో ఎక్కువ స్కోర్‌ రావడం, ఎంపిక ప్రక్రియలో మొదటి స్థానంలో నిలవడం చర్చనీయాంశమైంది. అయితే.. రాజకీయాలు, బంధుప్రీతిని కారణంగా చూపుతూ.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆమె నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఇదిలా ఉండగా.. కేరళ ఫిషరీస్‌ అండ్‌ ఓషన్ స్టడీస్‌ యూనివర్సిటీ వీసీ నియామకం కూడా చెల్లదని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని