West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం.. యువతిని పట్టుకొని చావబాదారు!

పశ్చిమ బెంగాల్‌లో ఓ యువతి కాళ్లుచేతులు పట్టుకొని గాల్లో వేలాడదీసి కొందరు వ్యక్తులు ఇష్టమొచ్చినట్లుగా చావ బాదారు.

Updated : 09 Jul 2024 21:40 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని (West Bengal) చోప్రా (Chopra) తరహాలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిని కొందరు పురుషులు కాళ్లు చేతులు పట్టుకొని చావ బాదడం విమర్శలకు తావిస్తోంది. ఈ వీడియోను భాజపా (BJP) జాతీయ అధికార ప్రతినిధి షహజాద్‌ పూనావాలా ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై (Mamata Benarjee) మండిపడ్డారు. ‘‘ బెంగాల్‌లో మరో తాలిబన్‌ తరహా ఘటన’’ అంటూ రాసుకొచ్చారు. వీడియోలో యువతిపై దాడి చేస్తున్నవారు తృణమూల్‌ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులని ఆరోపించారు.

‘‘ఈ తరహా ఘటనలు తరచూ రాష్ట్రంలో జరుగుతున్నాయి. టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్‌ కాదు. తాలిబానీ ముజే చాహియే. తృణమూల్ నేతలు చోప్రా, సందేశ్‌ఖలి తదితర ఘటనల్లోని నిందితులను వెనకేసుకొస్తున్నారు. అందుకే సీఎం మమతా బెనర్జీకి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది’’ అంటూ విమర్శించారు. ‘ మా- మాటి- మనుష్‌’ అంటూ నినాదాలు చేసే తృణమూల్‌ నేతలు ఇకపై.. ‘అత్యాచారం చేసిన వాళ్లను కాపాడుతాం. అన్యాయానికి బాసటగా నిలుస్తాం, బాంబులు పెట్టేవారికి అండగా ఉంటాం’ అని కొత్త నినాదాలు అందుకోవాలని విమర్శించారు. 

ఇండియా కూటమి నేతలు మహిళలపై కపట ప్రేమను చూపిస్తున్నారని పూనావాలా మండిపడ్డారు. మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే రాహుల్‌ గాంధీలాంటి నేతలు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని విమర్శించారు. గతంలో మణిపుర్‌ మహిళలపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధితుల ఇళ్లకు వెళ్లిన రాహుల్‌.. పచ్చిమబెంగాల్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ, ప్రియాంక చతుర్వేది, ఆమ్‌ఆద్మీ పార్టీ ఈ సమస్యపై మాట్లాడతారా? అని నిలదీశారు.

పశ్చిమబెంగాల్‌లోని చోప్రాలో ఇటీవల ఓ దారుణ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నడి రోడ్డుపై చుట్టూ జనం గుమిగూడి ఉండగా.. ఇద్దర్ని ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. బాధితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. పశువుల్ని బాదినట్లు వారిపై విరుచుకుపడటం, అందరూ చూస్తున్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని