12 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్‌ ఎప్పుడు..?

12ఏళ్లలోపు చిన్నారులకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 20 May 2021 22:15 IST

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 176 దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల డోసులను పంపిణీ చేశారు. అయితే, ఇప్పటివరకు ఆమోదం పొందిన వ్యాక్సిన్లు కేవలం పెద్దవారికి మాత్రమే ఇస్తున్నారు. ఇక చిన్నారులపై వ్యాక్సిన్‌ ప్రయోగాలను ప్రారంభించిన శాస్త్రవేత్తలు.. వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 12ఏళ్లలోపు చిన్నారులకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘చిన్నారులకు వ్యాక్సిన్‌పై ఇప్పటికే ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చిన్నారులకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాక్సిన్‌ల ప్రభావం ఎంతకాలం ఉంటుందో స్పష్టంగా తెలియని తరుణంలో పెద్దవారి కోసం బూస్టర్‌ డోసు కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే మీజిల్స్‌ టీకా మాదిరిగా ఇవి జీవితాంతం రక్షణ కల్పించలేవు’ అని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణులు ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్‌ తీసుకున్న 8 నుంచి 12 నెలల అనంతరం బూస్టర్‌ డోసు అవసరమయ్యే అవకాశం ఉంటుందని ఫైజర్‌ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా ఈమధ్యే అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

ఇక భారత్‌లోనూ చిన్నారులపై కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను చిన్నారుల్లో ప్రయోగించేందుకు ఇక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. త్వరలోనే వీటి రెండు, మూడో దశ ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు కొవాగ్జిన్‌ను 18ఏళ్ల వయసుపైబడిన వారికే అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని