Anthrax: కేరళలో ఆంత్రాక్స్‌ కలకలం.. మృత్యువాతపడుతున్న అడవి పందులు!

కేరళను (Kerala) వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రమాదకర వైరస్‌ల వ్యాప్తితో వణుకుతోన్న కేరళలో తాజాగా ఆంత్రాక్స్‌ (Anthrax) కేసులు వెలుగు చూడడం కలవరం రేపింది.

Updated : 30 Jun 2022 16:17 IST

త్రిశ్శూర్‌: కేరళను వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రమాదకర వైరస్‌ల వ్యాప్తితో వణుకుతున్న కేరళలో తాజాగా ఆంత్రాక్స్‌ (Anthrax) కేసులు వెలుగు చూడడం కలవరం రేపింది. అత్తిరప్పిళ్లి అటవీ ప్రాంతంలో ఆంత్రాక్స్‌ కారణంగా అడవి పందులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. అయితే, వీటిని పరిశీలించిన అధికారులు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అత్తిరప్పిళ్లి ప్రాంతంలోని అటవీ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల ఐదారు అడవి పందులు (Wild Boars) మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వాటి నమూనాలను పరీక్షించిన అనంతరం అవి ఆంత్రాక్స్‌ వల్లే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అత్యవసర సమావేశం నిర్వహించిన పశుసంవర్థక శాఖ అధికారులు.. నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇతర పశువులు లేదా మనుషులకు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు గాను స్థానికంగా పశువులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు.

ఆంత్రాక్స్‌ (Anthrax) అనేది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి. ఈ అంటువ్యాధి పశువులు, మేకలు, గొర్రెలతోపాటు అడవి జంతువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, జంతువుల నుంచి మానవులకూ సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యం బారిన జంతువుల మాంసం తినడం వల్ల మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధివల్ల చినిపోయిన కళేబరాలను ఎత్తుకెళ్లేవారికి, వాటి చర్మాలను తొలిచివేరికి, తోళ్ల పరిశ్రమలో పనిచేసేవారికీ వ్యాధి ముప్పు ఉంటుంది. వ్యాధి లక్షణాలు మూడురోజుల్లోనే బయటపడతాయి. జ్వరం, రక్తపు విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై పుండ్లు, జలుబు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం నెలల వరకూ లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స (యాంటీబయాటిక్స్‌తో) తీసుకోవాలి. లేదంటే ప్రాణాంతకంగా మారుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని