Vaccine: టీకాలపై వదంతులతో పేదలకే హాని!

కరోనా వ్యాక్సిన్‌పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజలకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.

Published : 21 Jun 2021 14:42 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజలకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై దుష్ర్పచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభమైన సందర్భంగా.. వ్యాక్సిన్‌లపై కొందరు చేసే ఉద్దేశపూర్వక చెడు ప్రచారంపై కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది.

‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశవ్యాప్తంగా నేటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ కొనసాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత తొందరగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తిచేసే వారినుంచి ప్రజలను రక్షించుకోవాలన్నారు. లేకుంటే అలాంటి వదంతుల వల్ల సమాజంలో పేద, వెనుకబడిన వర్గాలకు తీవ్రహాని జరుగుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

సెకండ్‌ వేవ్‌పై విజయం దిశగా..

‘కరోనా వైరస్‌పై జరుగుతోన్న పోరులో విజయం దిశగా మెల్లగా అడుగులు వేస్తున్నాం. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించి తేలికగా తీసుకుంటే, మరోసారి మహమ్మారి ఉద్ధృతి పెరగవచ్చు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దేశప్రజలను హెచ్చరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం యోగా చేసిన ఆయన.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని