సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయి: రైతు సంఘాలు 

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దుకు డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు సంఘాలు విచారం .......

Published : 26 Jan 2021 18:58 IST

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దుకు డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారడంపై రైతు సంఘాలు విచారం వ్యక్తంచేశాయి. సంఘ విద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించాయని సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. ఈ మేరకు 41 రైతు సంఘాల తరఫున సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ల పరేడ్‌లో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా దిల్లీలో చోటుచేసుకున్న అవాంఛనీయ, అమోదయోగ్యంకాని ఘటనల్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది. అలాంటి చర్యలకు పాల్పడేవారిని దరిచేరనీయబోమని రైతు నేతలు ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తాము అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రూట్‌ మ్యాప్‌ను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపింది. 

తమ శాంతియుత పోరాటంలోకి సంఘ విద్రోహక శక్తులు ప్రవేశించాయని పేర్కొంది. శాంతియుత పోరాటమే తమకు పెద్ద బలమని, ఏదైనా ఉల్లంఘన జరిగితే అది ఉద్యమాన్ని దెబ్బతీస్తుందని  ఎల్లప్పుడూ భావిస్తూవచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా తన ప్రకటనలో పేర్కొంది.  క్రమశిక్షణను ఉల్లంఘించే అలాంటి శక్తులతో తాము దూరంగా ఉంటామని తెలిపింది. రూట్‌ మ్యాప్‌కు కట్టుబడి పరేడ్‌ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రతిఒక్కరికీ గట్టిగా విజ్ఞప్తి చేసినట్టు పేర్కొంది. ఎలాంటి హింసాత్మక చర్యలకు, జాతీయ చిహ్నాలు, గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించకూడదని హెచ్చరించినట్టు రైతు నేతలు ప్రకటనలో తెలిపారు. 

ఇవీ చదవండి..

ర్యాలీలోకి ఇతరులు చొరబడ్డారు: తికాయత్‌

ఎర్రకోట వద్ద రైతన్న జెండా..!

ఉద్రిక్తతల నడుమ..కొనసాగుతోన్న ట్రాక్టర్‌ పరేడ్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని