మహారాష్ట్రలో 7కిలోల యురేనియం స్వాధీనం

మహారాష్ట్రలో అణుధార్మిక పదార్థాల స్మగ్లింగ్‌ రాకెట్‌ను నాగప్పడ ఏటీఎస్‌ బృందం బట్టబయలు చేసింది.

Published : 06 May 2021 23:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్రలో అణుధార్మిక పదార్థాల స్మగ్లింగ్‌ రాకెట్‌ను నాగప్పడ ఏటీఎస్‌ బృందం బట్టబయలు చేసింది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 7 కిలోల సహజ యురేనియం  స్వాధీనం చేసుకొంది. దీని విలువ రూ.21.3 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని నేడు ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు.  వీరు ఈ యురేనియంను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికారు.

నాగప్పడా ఏటీఎస్‌ బృందం కథనం ప్రకారం‘‘ఈ ఏడాది ఫిబ్రవరిలో థానేకు చెందిన జిగర్‌ పాండ్యా అనే వ్యక్తి విలువైన లోహపు ముక్కలను విక్రయిస్తున్నట్లు తెలిసి ఏటీఎస్‌ బృందం అప్రమత్తమైంది. అతను ఆ లోహపు ముక్కలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా  అదుపులోకి తీసుకొంది. అతడిని ఇంటరాగేషన్‌ చేయగా.. మన్‌ఖుర్ద్‌ ప్రాంతానికి చెందిన అబు తాహిర్‌ అఫ్జల్‌ హుస్సేన్‌ చౌద్రీ (31) అనే వ్యక్తి ఇచ్చినట్లు తేలింది. ఆ తర్వాత ఏటీసీ బృందం అతన్ని కుర్లా స్క్రాప్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి సీజ్‌ చేసిన యురేనియంను పరిశీలన నిమిత్తం బాబా అటామిక్‌ రీసెర్చి సెంటర్‌(బార్క్‌)కు తరలించింది. దీనిని పరిశీలించిన బార్క్‌ ఈ  యునియం ప్రభావానికి లోనైతే మనుషులకు అత్యంత ప్రమాదమని పేర్కొంది’’ అని ఏటీఎస్‌ వెల్లడించింది. 

నిందితులపై నాగ్‌పుర్‌ అటామిక్‌ మినరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఆఫ్‌ రీసెర్చి రీజనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు ‘అటామిక్‌ ఎనర్జీ యాక్ట్‌ 1962’ కింద కేసులు నమోదు చేశారు. వీరిని న్యాయస్థానం మే 12వరకు ఏటీఎస్‌ కస్టడీకి పంపిస్తు ఆదేశాలు జారీచేసింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని