Mehul Choksi: విమానాల్లేవ్‌.. బోటు ఎక్కలేదు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కరేబియన్‌ దీవి ఆంటిగ్వా దేశంలో ఉంటున్న ఆయన గత ఆదివారం

Updated : 26 May 2021 14:35 IST

ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన ఆంటిగ్వా ప్రభుత్వం

ఆంటిగ్వా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కరేబియన్‌ దీవి ఆంటిగ్వా దేశంలో ఉంటున్న ఆయన గత ఆదివారం సాయంత్రం నుంచి కన్పించకుండాపోయిన విషయం తెలిసిందే. మూడు రోజులు గడుస్తున్నా అతడి జాడ తెలియకపోవడంతో ఆంటిగ్వా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని గాస్టన్‌ బ్రౌనీ అక్కడి పార్లమెంట్‌కు తెలిపారు. అయితే అతడు క్యూబా పారిపోయి ఉండొచ్చన్న వార్తలను బ్రౌనీ ఖండించారు. 

‘‘ఛోక్సీ ఆంటిగ్వా విడిచి క్యూబా లేదా ఇతర కరేబియన్‌ దేశానికి పారిపోయారని చెప్పేందుకు కచ్చితమైన సమాచారం లేదు. ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టు నుంచి ఎలాంటి విమాన రాకపోకలు జరగట్లేదు. ఇక బోటు ద్వారా క్యూబా వెళ్లి ఉంటే మాకు కచ్చితంగా తెలుస్తుంది. ఆయన బోటు ఎక్కినట్లు ఆధారాల్లేవు. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారని భావిస్తున్నాం. ఆచూకీ కోసం అన్ని చర్యలు చేపట్టాం’’అని బ్రౌనీ పార్లమెంట్‌కు వివరించారు. అంతేగాక, ఇంటర్‌పోల్‌తో కలిసి ఎల్లో నోటీసు కూడా జారీ చేసినట్లు తెలిపారు. అదృశ్యమైన వ్యక్తుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఇంటర్‌పోల్‌ ఈ ఎల్లో నోటీసు జారీ చేస్తుంది. దీనిద్వారా కన్పించకుండా పోయిన వ్యక్తి దేశాల మధ్య ప్రయాణం చేశాడా లేదా అన్నది తెలుస్తుంది.

గత ఆదివారం ఛోక్సీ డిన్నర్‌ చేసేందుకు తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కన్పించకుండాపోయారు. అదే రోజు సాయంత్రం జాలీ హార్బర్‌ ప్రాంతంలో ఆయన కారును పోలీసులు గుర్తించారు. అయితే అందులో ఆయన లేకపోవడంతో గాలింపు చేపట్టారు.

పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే ఛోక్సీ భారత్‌ విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆంటిగ్వాలో పౌరసత్వం తీసుకుని 2018 నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే ఛోక్సీని అప్పగించాలని భారత్‌ కోరినప్పటికీ. అందుకు ఆంటిగ్వా ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది. ఇటీవల ఈ విషయమై భారత్‌ నుంచి ఒత్తిడి ఎక్కువైన నేపథ్యంలో ఛోక్సీ దేశం విడిచి పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర మార్గం ద్వారా క్యూబా వెళ్లి ఉండొచ్చని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. క్యూబాలో ఛోక్సీకి ఆస్తులు కూడా ఉన్నాయి. మరోవైపు ఛోక్సీ ఆచూకీపై సీబీఐ కూడా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని