Delhi: దిల్లీ ఆటోలో...అమెరికా మంత్రి సందడి..!

క్వాడ్‌ (Quad) సదస్సు కోసం దిల్లీ వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ (Antony Blinken) ఆటోలో ప్రయాణించి సందడి చేశారు. అక్కడ ఉన్న చిన్నారులతో ఫొటోలు దిగారు.

Updated : 04 Mar 2023 15:42 IST

దిల్లీ: క్వాడ్‌ (Quad) సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ (Antony Blinken) దిల్లీలో కాసేపు సందడి చేశారు. ఆటోలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంతేకాకుండా అక్కడున్న చిన్నారులతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. అమెరికా-భారత్‌ (USA-India) మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న భారత్‌లోని కాన్సులేట్‌లను ఆయన అభినందించారు. ‘‘ భారత్‌లోని యూఎస్‌ఏ ఎంబసీతో పాటు, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, ముంబయి కాన్సులేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులందరినీ ప్రత్యక్షంగా కలవడం ఎంతో ఆనందగా ఉంది. భారత్‌- అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు వారు చేస్తున్న కృషి, పట్టుదలకు కృతజ్ఞతలు’’ అంటూ ఆయన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు ఎంత దృఢంగా ఉన్నాయో చెప్పేందుకు తన పర్యటనే ఓ ఉదాహరణ అని ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌ను రక్షించడంలో ఇరుదేశాల నిబద్ధతకు తన పర్యటన అద్దంపడుతోందని అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన జీ20 సదస్సుకు అధ్యక్ష హోదాలో అతిథ్యం ఇస్తున్న భారత్‌కు ఆయన  అభినందించారు. ఇండో-ఫసిపిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును సమీక్షించేందుకు దిల్లీలో ఇవాళ క్వాడ్‌ విదేశాంగ మంత్రులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్‌ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తోపాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్‌, యోషిమాషా హయాషి, పెన్నీ వాంగ్‌ పాల్గొన్నారు. చైనాను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు