Boycott Culture: ‘బాయ్‌కాట్‌’ మంచి పద్ధతి కాదు..!: కేంద్ర మంత్రి ఠాకూర్‌

చలన చిత్రాల బహిష్కరణ సంస్కృతిని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఖండించారు. ఏదైనా సమస్య ఉంటే.. సంబంధిత విభాగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Published : 27 Jan 2023 23:45 IST

ముంబయి: సినిమాల ‘బాయ్‌కాట్‌’ ట్రెండ్‌పై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బహిష్కరణ సంస్కృతి(Boycott Culture)ని ఆయన ఖండించారు! ఒక సానుకూల శక్తిగా భారత్‌ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోన్న సమయంలో.. ఇలాంటి వ్యవహారాలు స్థానిక వాతావరణాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏదైనా సినిమా విషయంలో ఎవరికైనా సమస్య ఉంటే.. సంబంధిత ప్రభుత్వ విభాగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. షారుక్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్(Pathaan)’ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ఇటీవల పెద్దఎత్తున పిలుపులు వచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

షాంఘై సహకార సంస్థ(SCO) ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి ముంబయి వచ్చిన కేంద్ర మంత్రి.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నపై ఈ మేరకు స్పందించారు. ‘ఒక సాఫ్ట్ పవర్‌గా భారత్‌ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోన్న సమయమిది. పైగా.. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఇలాంటి తరుణంలో బాయ్‌కాట్‌ వంటి పనులు వాతావరణాన్ని దెబ్బతిస్తాయి. కొన్నిసార్లు కేవలం ఇక్కడి సానుకూల వాతావరణాన్ని చెడగొట్టడానికే.. కొంతమంది ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మాట్లాడతారు. దానివల్ల సమస్యలు వస్తాయి. ఇలా జరగకూడదు. ఏదైనా సినిమా విషయంలో ఎవరికైనా సమస్య ఉంటే.. సంబంధిత ప్రభుత్వ విభాగాన్ని సంప్రదించాలి. ఆ విభాగం.. నిర్మాతలు, దర్శకులతో చర్చిస్తుంది’ అని ఠాకూర్‌ అన్నారు.

సృజనాత్మకత విషయంలో స్వేచ్ఛ ఆవశ్యకతను చాటిచెబుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫాంలలోని కంటెంట్‌ను పర్యవేక్షించడానికి తగిన వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. సృజనాత్మకతపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని పేర్కొన్నారు. ‘ఓటీటీ ప్లాట్‌ఫాంలలోని కంటెంట్‌పై అభ్యంతరాలను సమాచార, ప్రసారశాఖ స్వీకరిస్తుంది. అయితే, దాదాపు 95 శాతం ఫిర్యాదులు నిర్మాతల స్థాయిలోనే పరిష్కారమవుతాయి. మిగతావి కంటెంట్ పబ్లిషర్స్‌ సంఘం స్థాయిలో కొలిక్కివస్తాయి. ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీకి కేవలం ఒక శాతం ఫిర్యాదులు మాత్రమే వస్తాయి. అలాంటి సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి ఠాకూర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని