Vaccine: ముందస్తు రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు: కేంద్రం

వ్యాక్సిన్‌ కోసం ముందుగా ఎవరూ రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. 18 ఏళ్లు దాటినవారెవరైనా దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసి వ్యా్క్సిన్‌ వేయించుకోవచ్చని తెలిపింది..

Published : 15 Jun 2021 20:39 IST

దిల్లీ: వ్యాక్సిన్‌ కోసం ముందుగా ఎవరూ రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. 18 ఏళ్లు దాటినవారెవరైనా దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. టీకా కోసం ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌పై అనుమానాలతో చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని, దీనిపై శాస్త్రీయ విధానం ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు ‘ కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్ కమ్యూనికేషన్‌ స్ట్రాటజీ’ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకుంది.

కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. దేశ వ్యాప్తంగా తాజాగా జరిగిన రెండు ఘటనలే ఇందుకు నిదర్శనం. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఓ వృద్ధురాలు వ్యాక్సిన్‌ వేయించుకోకుండా ఓ నీళ్ల డ్రమ్ము వెనుక ఉండిపోయింది. ఆమెకు వ్యాక్సిన్‌ వేసేందుకు వైద్యసిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. మరో ఘటనలో మధ్యప్రదేశ్‌లో వ్యాక్సిన్లు వేసేందుకు వెళ్లిన సిబ్బందిపై ఓ గిరిజన గ్రామస్థులు దాడి చేశారు. వ్యాక్సిన్‌పై సరైన అవగాహన లేనందువల్లే వారంతా టీకా వేయించుకునేందుకు వెనకాడుతున్నారని, వారిలో అవగాహన కల్పించి వీలైంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.

18 ఏళ్లు దాటిన వారికి ముందస్తు రిజిస్ట్రేషన్‌ లేకుండా వ్యాక్సిన్‌ విధానాన్ని కేంద్రం ఇది వరకే ప్రారంభించినప్పటికీ ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.అత్యుత్తమ ఆరోగ్య విధానాలు అమల్లో ఉన్న తమిళనాడులోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అత్యధిక టీకాలు ఇచ్చే రాష్ట్రాల జాబితాలో చివరి ఐదుస్థానాల్లో ఉంది. 18-44 ఏళ్ల మధ్య వారికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసి.. కొవిడ్‌ నిబంధనలను సడలించినట్లయితే దేశం ఆర్థికంగా పుంజుకునేందుకు మార్గం సుగమమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు