
CEA: ముఖ్య ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్
దిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా (సీఈఏ) డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్ను కేంద్రం నియమించింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న వేళ ఆయన నియామకంపై కేంద్ర ఆర్థికశాఖ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు వెల్లడించింది. డాక్టర్ నాగేశ్వరన్ రచయితగా, అధ్యాపకుడిగా, కన్సల్టెంట్గా పనిచేశారు. భారత్, సింగపూర్లలోని పలు బిజినెస్ స్కూళ్లతో పాటు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో బోధించారు. 2019 నుంచి 2021 వరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా కూడా కొనసాగారు.
కొత్త సీఈఏగా బాధ్యతలు చేపట్టిన అనంత నాగేశ్వరన్ ఐఐఎం -అహ్మదాబాద్లో పీజీ డిప్లొమా, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఇంతకుముందు సీఈఏగా ఉన్న కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్లోనే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పరిశోధన, విద్యా ప్రపంచం వైపు తిరిగి వెళ్లేందుకు వీలుగా రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.