Published : 26 Jun 2022 20:39 IST

Agnipath scheme: ‘అగ్నిపథ్‌’పై వెనక్కి తగ్గని కేంద్రం.. కోటా సంగతి తేల్చని రాష్ట్రాలు..!

దిల్లీ: అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath scheme)పై ఓ వైపు ఆందోళనలు కొనసాగుతున్నా.. కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తొలి ఏడాది వయసు విషయంలో సడలింపులు ఇచ్చిన కేంద్రం.. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ప్రారంభించింది. రెగ్యులర్‌ సర్వీసులో వీరికి ప్రాధాన్యం ఇస్తామని కూడా ప్రకటించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించగా.. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. ఈ విషయంలో రాజకీయ కారణాలు ఎలా ఉన్నా.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చే అగ్నివీరుల కోసం ఇప్పటి వరకు అటు కేంద్రం గానీ, ఇటు రాష్ట్రాలు గానీ ఎలాంటి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో వారి భవిష్యత్‌పై నీలినీడలు అలుముకొన్నాయి.

Also Read: 4 ఏళ్ల తర్వాత ఇంటికే..ఆ తర్వాతే రెగ్యులర్‌ సర్వీసు కోసం దరఖాస్తు!

జూన్‌ 14న అగ్నిపథ్‌ స్కీమ్‌ను (Agnipath scheme) కేంద్రం ప్రకటించింది. ఈ పథకం ప్రకటించిన వెంటనే ఉత్తరాదిలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకూ పాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ఛాయలు కనిపించాయి. ఈ నేపథ్యంలో యూపీ, మధ్యప్రదేశ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, అస్సాం వంటి భాజపా పాలిత రాష్ట్రాలు పోలీసు నియామకాల్లో అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సైతం సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్‌ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రకటనల వరకు బాగానే ఉన్నా.. ఈ ప్రక్రియ అంత సులువేమీ కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కేంద్ర సాయుధ దళాల్లో పనిచేసిన అగ్నివీరులకు రాష్ట్ర పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడమనేది వీలుకాదని ఓ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ అధికారి తెలిపారు. ఆర్మీలో రిజర్వేషన్లు ఉండవని, ఒకవేళ రాష్ట్ర పోలీసు నియామకాల్లో కోటాకు అవకాశం ఇస్తే అగ్నివీరులుగా చేరని వారు నష్టపోతారని చెప్పారు. ఈ కారణంగా బాగా చదువుకున్న యువత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరడం కష్టతరమవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రకటనలో ముందు.. ఆచరణలో వెనక

  • అగ్నిపథ్‌ స్కీమ్‌ గురించి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వెంటనే స్పందించారు. అగ్నివీరులుగా పనిచేసిన వారికి హరియాణా పోలీస్‌ జాబ్‌ లేదంటే గ్రూప్‌-సి పోస్టు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు ఆ రాష్ట్రం ఎంత శాతం రిజర్వేషన్‌ కల్పిస్తుందనేది వెల్లడించలేదు.
  • ఉత్తరాఖండ్‌ సైతం ఇలాంటి ప్రకటనే చేసింది. అగ్నివీరులను పోలీసు, డిజాస్టర్‌, ఛార్‌దామ్‌ మేననేజ్‌మెంట్‌ శాఖల్లో కోటా ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు. అయితే, ఎంత శాతం కోటా అనేది వెల్లడించలేదు. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఉత్తరాఖండ్‌ పూర్వ సైనిక్‌ కల్యాణ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (UNPL) ఉంది. దీని ద్వారా 30-35 వేల మంది ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు ఉద్యోగం కల్పించినట్లు ఆ రాష్ట్ర సీఎస్‌ తెలిపారు. వారంతా వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ప్యూన్లు, క్లర్క్‌లుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు సైతం అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించాయి. కానీ ఎంత శాతం? ఎలా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని యూపీకి చెందిన పోలీసు అధికారి తెలపగా.. రిజర్వేషన్ల అంశం పరిశీలనలో ఉందని, దానికింకా గడువు ఉందని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 
  • భాజపా పాలిత రాష్ట్రమైన గుజరాత్‌ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

వ్యతిరేకిస్తున్న ఎన్డీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు

మరోవైపు భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ పథకాన్నే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పథకాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలంటూ రాజస్థాన్‌ కేబినెట్‌ తీర్మానం కూడా చేసింది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సైతం ఈ పథకం రద్దుకు డిమాండ్‌ చేశారు.

  • ఛత్తీస్‌గఢ్‌లో కానిస్టేబుల్‌ నియామకాల్లో ప్రస్తుతం హోంగార్డులకు 25 శాతం, అసిస్టెంట్‌ కానిస్టేబుల్స్‌కు 15 శాతం, ఎక్స్‌ సర్వీసుమెన్లకు 10 శాతం కోటా ఇస్తున్నామని ఆ రాష్ట్ర పబ్లిక్‌ రిలేషన్‌ కమిషనర్‌ దీపాన్షు కబ్రా తెలిపారు. ఒకవేళ అగ్నివీరులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తే యువతకు ప్రాధాన్యమివ్వాలన్న లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికే ఇస్తున్న ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ కోటాలోనే వారికీ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
  • పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు అగ్నివీరుల నియామకంపై ఎలాంటి ఆలోచనా చేయలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అప్పుడు ఆలోచిస్తామని పేర్కొన్నారు.
  • దక్షిణాది విషయానికొస్తే భాజపా అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా అగ్నివీరుల అంశంపై చర్చించలేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఏపీ ప్రభుత్వం సైతం దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ఈ పథకాన్ని వ్యతిరేకిస్తోంది.
Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని