Updated : 07 May 2022 10:16 IST

Karnataka: రూ.2500 కోట్లు ఇస్తే సీఎం పదవి ఇస్తానన్నారు.. భాజపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు జరగనుందంటూ గత కొంతకాలంగా వార్తలు వెల్లువెత్తుతోన్న వేళ అధికార భాజపా శాసనసభ్యుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2500కోట్లు ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వెల్లడించారు. దిల్లీ నుంచి వచ్చిన కొందరు తనకు ఈ ఆఫర్‌ ఇచ్చారని ప్రకటించారు. అయితే ఇలాంటి మాటలకు మోసపోవద్దంటూ ఆయన కార్యకర్తలకు హితవు పలికారు. 

గురువారం రాయదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో బసనగౌడ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిచేతా మోసపోవద్దు. మనల్ని మోసం చేసేందుకు చాలా మంది నాయకుల ముసుగులు వేసుకుని వస్తుంటారు. టికెట్లు ఇస్తామని, దిల్లీకి తీసుకెళ్లి సోనియా గాంధీ, జేపీ నడ్డాతో మాట్లాడిస్తామని చెబుతారు. ఇలాంటి వాళ్లు నాకూ ఎదురయ్యారు. దిల్లీ నుంచి కొంతమంది నా దగ్గరకు వచ్చారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో పనిచేశామని చెప్పారు. నన్ను సీఎంను చేస్తానని, అందుకు రూ. 2500కోట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను వారికి ఒకటే చెప్పాను. రూ.2500కోట్లు అంటే ఎంతమొత్తమో తెలుసా అని ప్రశ్నించాను. అదంతా పెట్టాలంటే ఓ గోదామే కావాలి అని అన్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వాళ్లు చాలా మంది వస్తారని, అయితే వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. 

కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ ఈ రాష్ట్రంపై భాజపా దృష్టిపెట్టింది. ఇటీవల హిజాబ్‌, హలాల్‌ వంటి వివాదాలతో సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేపట్టాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరులో పర్యటించడం ఈ ఊహాగానాలు మరింత ఆజ్యం పోసింది. అయితే అలాంటిదేమీ లేదంటూ భాజపా నేతలు కొట్టిపారేశారు. తాజాగా కాషాయ పార్టీ ఎమ్మెల్యే బసనగౌడ సీఎం ఆఫర్‌పై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. బసనగౌడ గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, తాను సీఎం పదవి రేసులో ఉన్నట్లు ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పడం గమనార్హం. 

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్‌ డీకే శివకుమార్‌ స్పందించారు. ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకోవాలని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts