Renukaswamy Murder Case: దర్శన్‌, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్‌ ఏమన్నారంటే..

Renukaswamy Murder Case: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడలకు వివాహం జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఆయన న్యాయవాది వివరణ ఇచ్చారు.

Published : 16 Jun 2024 12:33 IST

బెంగళూరు: అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడల మధ్య సంబంధంపై ఆయన న్యాయవాది అనిల్‌ బాబు వివరణ ఇచ్చారు. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. వారికి వివాహమూ జరిగిందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆయన స్పందించారు. వారిద్దరూ కేవలం సహ నటులు మాత్రమేనని.. అంతకు మించి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

అన్నపూర్ణేశ్వరి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దర్శన్‌ను అనిల్‌ బాబు శనివారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రా గౌడ, ఆయనకు మధ్య సంబంధం ఉందంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. ‘‘అరెస్టు తర్వాత దర్శన్‌ను నేను రెండుసార్లు కలిశాను. ఆయన భార్య విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల తరఫున నేను ఈ కేసును వాదిస్తున్నాను. పవిత్రా గౌడను ఆయన భార్యగా చిత్రీకరిస్తుండటంపై వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయలక్ష్మి బయటకు కూడా రాలేకపోతున్నారు. దర్శన్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నది తాను మాత్రమేనని ఆమె స్పష్టం చేయదల్చుకున్నారు. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. దర్శన్‌కు పవిత్రా గౌడ ఒక స్నేహితురాలు, సహ నటి మాత్రమే. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. పొరపాటున మీడియా ఆమెను దర్శన్‌ను భార్యగా పేర్కొంటోంది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఆయన భార్య విజయలక్ష్మి మాత్రమే’’ అని అనిల్‌ బాబు స్పష్టం చేశారు.

నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?

కస్టడీలో దర్శన్‌ ఆరోగ్యం బాగానే ఉందని అనిల్‌ వెల్లడించారు. ఆయనకు ఎప్పటి నుంచో భుజం, చీలమండ నొప్పి ఉందని తెలిపారు. పోలీసుల సమక్షంలో ఆరోగ్యం మినహాయించి ఎక్కువ ప్రశ్నలు అడగలేమని వెల్లడించారు. ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వదంతులు ప్రచారం చేయొద్దన్నారు. సరైన సమయంలో, తగిన ఆధారాలతో సెషన్స్‌ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకుంటామన్నారు.

రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు లొంగిపోయిన ఐదుగురుతో కలిసి 16 మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ గిరీశ్‌ తెలిపారు. వీరిలో దర్శన్‌, పవిత్ర సహా తొమ్మిది మంది పోలీసు కస్టడీని జూన్‌ 20 వరకు న్యాయస్థానం శనివారం పొడిగించింది. వైద్యపరీక్షల అనంతరం వారిని అన్నపూర్ణేశ్వరినగర ఠాణాకు తరలించారు. పవిత్రా  గౌడను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో చేర్చారు. మరోవైపు పవిత్రా గౌడకు అశ్లీల సందేశాలు పంపించాడన్న కోపంతోనే తాను రేణుకాస్వామిపై చేయి చేసుకున్నానని విచారణ సమయంలో పోలీసులకు దర్శన్‌ వివరించారు. రెండు దెబ్బలు కొట్టి, షెడ్డు నుంచి బయటకు వచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి ఆ నేరాన్ని తనపై నెడుతున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని