
మోదీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్.. వీరంతా బిహార్‌లో టీకా తీసుకున్నారట..!
పట్నా: అదేంటీ.. ప్రధాని మోదీ దిల్లీలో ఉంటారు.. అక్షయ్ కుమార్ ఉండేది ముంబయిలో.. ప్రియాంక చోప్రా చాన్నాళ్ల నుంచి అమెరికాలోనే ఉంటున్నారు కదా.. మరి వీరంతా బిహార్‌లో ఒకే చోట ఎలా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు అనుకుంటున్నారా..? అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం వల్ల ఇలా జరిగింది. బిహార్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగిన కొవిడ్ టీకా డేటా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నవారి జాబితాలో మోదీ, ప్రియాంక, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
అర్వాల్ జిల్లా కార్పీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో టీకాలు వేయించుకున్నవారి జాబితాను వ్యాక్సినేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇటీవల ఆ జాబితాను పరిశీలించగా.. అందులో నరేంద్రమోదీ, ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్, అమిత్ షా, సోనియా గాంధీ వంటి ప్రముఖుల పేర్లు కన్పించాయి. వీరంతా ఆ జాబితాలో పలుమార్లు ఈ హెల్త్ సెంటర్‌లో టీకా తీసుకున్నట్లుగా ఉండటంతో అవాక్కవడం అధికారుల వంతైంది. ఈ జాబితాకు సంబంధించిన ఫొటోలను ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
దీంతో స్పందించిన స్థానిక యంత్రాంగం ఘటనపై విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించారు. మరికొంత మందిని విచారిస్తున్నట్లు తెలిపారు. దీనిపై అర్వాల్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. పరీక్షలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు మేమెంతో కష్టపడుతున్నాం. ఆ సమయంలో ఇలాంటి అక్రమాలు జరుగుతుండటం విచారకరం. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాం. కార్పీతో పాటు ఇతర హెల్త్ సెంటర్లలోని జాబితాను కూడా పరిశీలిస్తున్నాం’’ అని తెలిపారు.
ఓవైపు దేశవ్యాప్తంగా 50శాతానికి పైగా వయోజనులకు రెండు డోసుల టీకా, 85శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న వేళ.. ఇలాంటి డేటా మోసాలు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.