ఆకాశం నుంచి పడ్డ ఆ వస్తువులు చైనా రాకెట్‌ శకలాలేనా?

ఓ లోహపు రింగు, సిలిండర్‌ ఆకారంలో ఉన్న వస్తువొకటి ఆకాశం నుంచి పడడం మహారాష్ట్రలో శనివారం రాత్రి కలకలం రేపింది...

Updated : 04 Apr 2022 11:11 IST

నాగ్‌పూర్‌: ఓ లోహపు రింగు, సిలిండర్‌ ఆకారంలో ఉన్న వస్తువొకటి ఆకాశం నుంచి పడడం మహారాష్ట్రలో శనివారం రాత్రి కలకలం రేపింది. చంద్రపూర్‌ జిల్లా సిందెవాహి తెహసీల్‌ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఖాళీ స్థలంలో లోహపు రింగును ప్రజలు గుర్తించి తమకు సమాచారం అందించినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ అజయ్‌ గుల్హనే ఆదివారం ఉదయం తెలిపారు. ఈ విషయాన్ని ముంబయి విపత్తు నిర్వహణ అధికారులకు తెలియజేశామని వెల్లడించారు. వారు రింగుతో పాటు మరో గ్రామంలో కనిపించిన సిలిండర్‌ లాంటి వస్తువును త్వరలో పరిశీలించినున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఇంకా ఏమైనా వస్తువులు పడ్డాయేమో పరిశీలించాలని జిల్లాలోని ప్రతి గ్రామ జూనియర్‌ రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు గుల్హనే తెలిపారు.

ఆకాశం నుంచి మండుతున్న కొన్ని వస్తువులు భూమివైపు దూసుకొస్తున్న దృశ్యాలు శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటి శకలాలే తాజా రింగు, సిలిండర్ అయి ఉంటాయని అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. తొలుత ఉల్కలు అయి ఉంటాయని అంతా భావించారు. కానీ, మంటలు అసాధారణంగా కనిపించడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఇవి రాకెట్ బూస్టర్ల శకలాలూ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఇది ఫిబ్రవరి 2021లో చైనా ప్రయోగించిన ఛాంగ్‌ ఝెంగ్‌ 5బీ రాకెట్‌ శకలాలే అయి ఉంటాయని అమెరికాకు చెందిన ఖగోళ నిపుణుడు మెక్‌ డోవెల్‌ అనుమానం వ్యక్తం చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని