‘వడ్డీరేట్ల’పై పొరబాటా..? ఎన్నికల జిమ్మిక్కా?

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం తొలుత వడ్డీరేట్లను తగ్గించడం.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

Published : 01 Apr 2021 11:41 IST

కేంద్రానికి కాంగ్రెస్‌ చురకలు

దిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం తొలుత వడ్డీరేట్లను తగ్గించడం.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వాపస్‌ తీసుకోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కొన్ని కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపే ఆదేశాలపై పొరపాటు ఎలా జరిగిందని ప్రశ్నించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇక ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడింది. 

పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, గురువారం ఉదయానికి ఈ నిర్ణయంపై కేంద్ర వెనక్కి తగ్గింది. ‘‘పొదుపు పథకాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయి. పొరబాటుగా ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆర్థికమంత్రి ఈ ఉదయం ట్వీట్‌చేశారు.  

అయితే ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. ‘‘వడ్డీరేట్లను తగ్గించే ఉత్తర్వులను జారీ చేయడంలో నిర్మలా సీతారామన్‌ నిజంగానే తొలుత పొరబడి ఆ తర్వాత దిద్దుబాటు చర్యగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారా? లేదా దీని వెనుక ఎన్నికల ‘దూరదృష్టి’ ఏదైనా ఉందా’’అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘మేడం ఆర్థికమంత్రి.. మీరు సర్కస్‌ నడుపుతున్నారా? లేదా సర్కారా? కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అలాంటి ఆదేశాల్లో పొరబాటు ఎలా జరుగుతుంది..? దీనికి బాధ్యత ఎవరిది? మీకు(నిర్మలా సీతారామన్‌) ఆర్థికమంత్రిగా కొనసాగే హక్కు లేదు’’అని సుర్జేవాలా ట్విటర్‌లో మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని