Kiren Rijiju: కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు.. న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజు ఔట్‌..

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ( Law Ministry) బాధ్యతల నుంచి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను తొలగించారు. ఆ శాఖను మరో మంత్రికి అప్పగించారు.

Updated : 18 May 2023 15:13 IST

దిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రుల్లో ఇద్దరి శాఖలను మార్చుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. న్యాయశాఖ మంత్రి (Law Minister)గా ఉన్న కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal)కు న్యాయమంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక రిజిజుకు భూ విజ్ఞానశాస్త్ర శాఖ (Ministry of Earth Sciences) బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి గురువారం ఓ ప్రకటన వెలువడింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. కేంద్ర మంత్రుల శాఖల్లో మార్పులు చేసినట్లు రాష్ట్రపతి భవన్‌ ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం అర్జున్‌ మేఘ్వాల్‌ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉండగా.. ఇకపై వీటితో పాటు న్యాయశాఖకు స్వతంత్ర మంత్రిగా వ్యవహరించనున్నారు. కాగా.. కేబినెట్‌ హోదా లేకుండా న్యాయశాఖను స్వతంత్ర మంత్రికి అప్పగించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం భూవిజ్ఞానశాస్త్ర శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ చూస్తుండగా.. ఇప్పుడు ఆ శాఖను కిరణ్‌ రిజిజుకు అప్పగించారు. జితేంద్ర సింగ్‌ వద్ద ఇప్పటికే శాస్త్ర, సాంకేతికాభివృద్ధితోపాటు పలు శాఖలు ఉన్నాయి.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌.. రాజస్థాన్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

జడ్జీల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కిరణ్‌ రిజిజు గతేడాది నవంబరులో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని అప్పట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు, కేంద్రం మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల వేళ న్యాయశాఖ మంత్రి మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు