Jammu and Kashmir: రెండు బుల్లెట్లు దూసుకెళ్లినా.. ముష్కరులతో పోరాడి..!

దక్షిణ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. వారిని గుర్తించే పనిని జూమ్ సమర్థవంతంగా నిర్వహించింది. 

Updated : 17 Oct 2022 14:20 IST

శ్రీనగర్‌: మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు మీదకు వచ్చినా వెనకడుగు వేయరు సైనికులు. వారి శిక్షణలో ఓ జాగిలం కూడా అదే తరహాలో తన నిబద్ధతను చాటుకుంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య ఎన్‌కౌంటర్‌లో ఓ శునకం తీవ్రంగా గాయపడింది. అయినా దాని పోరాటం కొనసాగించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

దక్షిణ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. వారిని గుర్తించే పనిని జాగిలానికి అప్పగించారు. ‘ఆ శునకం  పేరు జూమ్‌. దానికి కఠిన శిక్షణ ఇచ్చాం. ఎంతో నిబద్ధత కలిగినది. గతంలో ఎన్నో ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఉంది’ అని అధికారులు వెల్లడించారు.

‘జూమ్‌ వారిని గుర్తించి.. దాడి చేసింది. ఆ క్రమంలోనే గాయపడింది. రెండు తుపాకీ గుండ్లు దూసుకెళ్లాయి. అయినా, దాని పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే ఘటనా స్థలానికి చేరుకున్న దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి’ అని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జూమ్‌ను ఆర్మీకి చెందిన హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు సైనికులు కూడా గాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని