Cheetah: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్లు మృతి

అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లూ మృతి చెందారు.

Updated : 16 Mar 2023 18:32 IST

ఇటానగర్: భారత సైన్యాని(Indian Army)కి చెందిన ఓ హెలికాప్టర్‌(Helicoptor) కుప్పకూలింది. అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా మండలా(Mandala) పర్వత ప్రాంతంలో గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. వారిని లెఫ్టినెంట్‌ కర్నల్‌ వీవీబీ రెడ్డి, మేజర్‌ జయంత్‌గా గుర్తించారు. రోజువారీ విధుల్లో భాగంగా ఇక్కడి సెంగే గ్రామం నుంచి అస్సాంలోని మిసామారీకి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం(Helicoptor Crash) జరిగినట్లు సైన్యం వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

‘‘అరుణాచల్‌లోని బోమ్‌డిలా సమీపంలో గురువారం ఉదయం 9.15 గంటలకు ఆర్మీ చెందిన ‘చీతా(Cheetah)’ హెలికాప్టర్‌కు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌(ATC)తో సంబంధాలు తెగిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. బోమ్‌డిలాకు పశ్చిమాన ఉన్న మండలా ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే సైన్యం, సశస్త్ర సీమాబల్‌, ఇండో-టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) బలగాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇక్కడి బంగ్లాజాప్‌ గ్రామ సమీపంలో హెలికాప్టర్‌ శకలాలు లభ్యమయ్యాయి. అయితే.. స్థానికంగా వాతావరణం పొగమంచుతో కూడిఉందని, 5 మీటర్ల పరిధి వరకే కనిపిస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని