Agnipath: అగ్నిపథ్‌ విషయంలో.. యువత తప్పుదోవ పట్టొద్దు : ఆర్మీ చీఫ్‌

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై జరుగుతోన్న తప్పుడు ప్రచారంతో యువత తప్పుదోవ పట్టొద్దని భారత సైన్యాధిపతి (Army Chief) జనరల్‌ మనోజ్‌ పాండే పేర్కొన్నారు.

Published : 20 Jun 2022 21:10 IST

ఈ పథకంతో అందరికీ ప్రయోజనమేనన్న జనరల్‌ మనోజ్‌ పాండే

దిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై జరుగుతోన్న తప్పుడు ప్రచారంతో యువత తప్పుదోవ పట్టొద్దని భారత సైన్యాధిపతి (Army Chief) జనరల్‌ మనోజ్‌ పాండే కోరారు. ఈ పథకం అటు ఆర్మీతో (Indian Army)పాటు యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్మీ చీఫ్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. పథకం అమలులోకి వచ్చిన తర్వాత సానుకూల మార్పులు కనిపిస్తాయి. తప్పుడు ప్రచారాలతో యువత తప్పుదోవ పట్టొద్దు. దేహధారుడ్య, రాత పరీక్షలకు సిద్ధం అవ్వండి’ అని దేశ యువతకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే సూచించారు. అగ్నిపథ్‌ పథకం యువతకే కాకుండా ఇటు ఆర్మీకి, దేశానికి ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే ఈ సంస్కరణలు తీసుకువస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఇందుకోసం సుదీర్ఘ కసరత్తు జరిగిందని ఉద్ఘాటించారు. వీటికి సంబంధించి వాస్తవ సమాచారం లేకనే తప్పుడు అపోహలకు దారితీస్తోందని ఆర్మీ చీఫ్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన సైన్యం.. అగ్నివీరుల (Agniveer) నియామకాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకోసం జులై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్‌లో వివరంగా పేర్కొంది. అంతేకాకుండా అగ్నివీరులకు ఇచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను నోటిషికేషన్‌లో పొందుపరిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని