ALH Dhruv: జమ్మూకశ్మీర్‌ ఘటన.. ‘ధ్రువ్‌’ను నిలిపివేసిన ఆర్మీ..!

తేలికపాటి హెలికాప్టర్‌ ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ (ALH Dhruv) వినియోగాన్ని భారత సైన్యం మరోసారి నిలిపివేసింది. ఇటీవల ఈ చాపర్‌ ఒకటి కూలిపోయి ఓ సాంకేతిక నిపుణుడు మరణించిన విషయం తెలిసిందే.

Published : 06 May 2023 11:54 IST

దిల్లీ: భారత సైన్యానికి (Indian Army) చెందిన తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌  (ALH Dhruv) రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ సాంకేతిక నిపుణుడు దుర్మరణం చెందాడు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ.. ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని మరోసారి నిలిపివేసింది. ఈ మేరకు మిలిటరీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ చాపర్ల వినియోగాన్ని నిలిపివేయడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఈ ఏడాది మార్చి 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ (ALH Dhruv).. ముంబయి తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధ్రువ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. అయితే గత సోమవారం నుంచే సైన్యం వీటి సేవలను పునరుద్ధరించగా.. గురువారం ఓ ధ్రువ్‌ హెలికాప్టర్‌ కూలిపోవడం గమనార్హం.

సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ చాపర్‌ కుప్పకూలింది (Helicopter Crash). ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ (Army).. ముందు జాగ్రత్త చర్యగా ధ్రువ్‌ చాపర్ల వినియోగాన్ని నిలిపివేసినట్లు మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నేవీ, కోస్ట్‌గార్డ్‌లోని ధ్రువ్‌ హెలికాప్టర్లకు సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని