Published : 16 Aug 2022 01:38 IST

Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్‌.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం

ఉత్తరాఖండ్‌కు చెందిన జవానుగా గుర్తించిన అధికారులు

దిల్లీ: దేశ రక్షణ కోసం సరిహద్దులో భారత జవాన్లు ((Indian Army) సవాళ్ల నడుమ విధులు నిర్వర్తిస్తుంటారు. అటువంటి సమయంలో కొన్నిసార్లు ఎదురయ్యే ప్రతికూల వాతావరణం నుంచి బయటపడటం అసాధ్యమే అని చెప్పవచ్చు. అత్యంత ప్రతికూల వాతావరణం ఉండే సియాచిన్‌ (Siachen) ప్రాంతంలో గతంలో సంభవించిన మంచు తుపాను ప్రమాదంలో పలువురి జవాన్ల ఆచూకీ లేకుండా పోయింది. ఆ సంఘటన జరిగిన 38 ఏళ్ల తర్వాత.. ఇటీవల ఇద్దరు జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒకరిని ఉత్తరాఖండ్‌కు చెందిన చంద్రశేఖర్‌ హర్బోలా అని ధ్రువీకరించిన ఆర్మీ అధికారులు.. మరొక జవాన్‌ను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.

1984లో పాకిస్థాన్‌తో యుద్ధం సందర్భంగా ‘ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌’ను (Operation Meghdoot) ఇండియన్‌ ఆర్మీ (Indian Army) చేపట్టింది. అందులో భాగంగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్‌ (Siachen)కు 19 కుమావన్‌ రెజిమెంట్‌కు చెందిన 20 మంది సైనికుల బృందం చేరుకుంది. అక్కడ పహారా కాస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న భారీ హిమపాతానికి (Avalanche) వారంతా కొట్టుకుపోయారు. వారిలో 15 మంది మృతదేహాలు ఇదివరకే లభ్యంకాగా ఐదుగురి జాడ మాత్రం తెలియరాలేదు. తాజాగా సియాచిన్‌లోని ఓ పాత బంకర్‌లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఉత్తరాఖండ్‌ అల్మోరాలోని ద్వారాహత్‌ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ హర్బోలా.. 1975లో భారత సైన్యంలో చేరారు. ఆయన భార్య శాంతిదేవీ ప్రస్తుతం సరస్వతి విహార్‌ కాలనీలో నివసిస్తున్నారు. భర్త మృతదేహం లభించిన విషయాన్ని జిల్లా అధికారులు ఆమెకు తెలియజేశారు. తనకు 28ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ ఘటన జరిగిందని.. అప్పటికే తమకు వివాహమై తొమ్మిదేళ్లు అయ్యిందని శాంతిదేవీ వెల్లడించారు. అప్పటికే వారికి నాలుగు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు వివరించారు. 1984 జనవరిలో చివరిసారిగా తన భర్త ఇంటికి వచ్చారని.. అనంతరం దేశ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన ఆచూకీ లేకుండా పోయారని గుర్తుచేసుకుంటూ విలపించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని