Jammu Kashmir: చొరబాటుకు సిద్ధంగా 200 మంది ఉగ్రవాదులు!

జమ్మూ- కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు బాగా తగ్గాయని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయినప్పటికీ, ప్రస్తుతం పాక్‌ నుంచి 200 మంది ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు...

Published : 07 May 2022 01:43 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు బాగా తగ్గాయని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయినప్పటికీ, ప్రస్తుతం పాక్‌ నుంచి 200 మంది ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కశ్మీర్‌ సరిహద్దులో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి భద్రతా పరిస్థితులను శుక్రవారం ఆయన వివరించారు. పర్వత ప్రాంతాలు, అడవుల గుండా మాత్రమే కాకుండా జమ్మూ, పంజాబ్, నేపాల్ మీదుగానూ చొరబాట్లు జరుగుతున్నాయన్నారు. అయితే.. వాటిని అడ్డుకునే యంత్రాంగం పటిష్ఠంగా ఉందని, ఈ మేరకు అన్ని రిజర్వ్ బలగాలను రంగంలోకి దించామని చెప్పారు. ఫిబ్రవరి 2021 నుంచి ఇండో- పాక్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం సమర్థంగా అమలవుతోందని తెలిపారు. గత పన్నెండు నెలల్లో.. ఒకటి నుంచి మూడు మాత్రమే కాల్పుల విరమణ ఉల్లంఘన ఘటనలు జరిగాయని వెల్లడించారు.

విదేశీ ఉగ్రవాదులతోపాటు రహస్య ప్రాంతాల్లో ప్రస్తుతం 40 నుంచి 50 మంది స్థానిక ఉగ్రవాదులు పనిచేస్తున్నారని ద్వివేది చెప్పారు. విదేశీ ఉగ్రవాదుల సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 21 మందిని మట్టుబెట్టామన్నారు. శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య స్థానికంగా క్రమంగా తగ్గుతోందని చెప్పారు. యువత అతివాద భావజాలంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. నిషేధిత సంస్థల్లో టీనేజర్లు ఎక్కువగా భర్తీ అవుతున్నారని తెలిపారు. అయితే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఈ దిశగా సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని.. 48 గుడ్‌విల్ స్కూళ్లలో 15 వేలకు పైగా విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటున్నారని చెప్పారు.

మరోవైపు, సరిహద్దుల్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. ‘ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 చిన్నపాటి క్యాంపులు ఉన్నాయి. వివిధ సైనిక స్థావరాలకు సమీపంలో తాత్కాలిక లాంచింగ్ ప్యాడ్‌లూ ఉన్నాయి. వీటి వెనుక పాకిస్థాన్ సైన్యం, దాని ఏజెన్సీల పాత్ర కొట్టిపారేయలేనిది’ అని అన్నారు. కశ్మీర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణ అవకాశాలపై స్పందిస్తూ.. రోడ్లపై సాయుధ దళాలు, పారామిలిటరీ అవసరం లేని రోజు అదే తొలగిపోతుందన్నారు. అమర్‌నాథ్ యాత్ర గురించి మాట్లాడుతూ.. 2019తో పోలిస్తే ఈ ఏడాది యాత్రికుల సంఖ్య రెండింతలు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఉగ్రవాద ఘటనలు జరగకుండా.. అదనపు బలగాలను మోహరిస్తున్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని