
190 విద్యార్థులు, 70 టీచర్లకు కరోనా..!
కేరళ మలప్పురంలో ఘటన
మలప్పురం: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. తాజాగా కేరళలో రెండు పాఠశాల్లోనే దాదాపు 260మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కేరళలోనూ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు కలిగిన పాఠశాలలో తొలుత ఓ పదో తరగతి విద్యార్థికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆ విద్యార్థి చదివే తరగతి మొత్తానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, వారందరిలో వైరస్ బయటపడింది. ఇలా మలప్పురం జిల్లాలో రెండు ప్రభుత్వం పాఠశాలల్లోనే 190 మంది విద్యార్థులు, మరో 70మంది టీచర్లకు వైరస్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కేవలం నిన్న ఒక్కరోజే అక్కడి స్థానిక ఉన్నత పాఠశాలలో 150మంది విద్యార్థులు, 34మంది ఉపాధ్యాయులకు వైరస్ సోకినట్లు తేలింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అంతేకాకుండా వైరస్ సోకిన విద్యార్థుల కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆ రెండు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు, క్రిమిసంహారక చర్యలు చేపట్టారు.
ఇదిలాఉంటే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ క్రియాశీల కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే 81శాతం ఉన్నాయి. వీటిలో ఒక్క కేరళలోనే 45.70శాతం ఉండగా, మహారాష్ట్రల్లో 25.05శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక (4.02), పశ్చిమ బెంగాల్ (3.23), తమిళనాడు (2.95) రాష్ట్రాల్లోనూ కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఇవీ చదవండి..
వుహాన్: కీలక ఆధారాలు లభ్యం
కేరళలో తొలి తల్లి పాల బ్యాంకు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.