Arpita Mukherjee: ఇంట్లో రూ.కోట్ల విలువైన నోట్ల కట్టలున్నా.. అపార్టుమెంటుకు రూ.11వేల బకాయి

పశ్చిమబెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇప్పటివరకు జరిపిన దాడిలో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు లభించిన సంగతి తెలిసిందే.

Updated : 01 Aug 2022 13:33 IST

అర్పితా ముఖర్జీపై ఓ ఐపీఎస్‌ అధికారి సెటైర్‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు లభించిన సంగతి తెలిసిందే. అర్పితాకు చెందిన పలు అపార్టుమెంట్లలో సోదాలు కొనసాగిస్తోన్న ఈడీకి.. భారీ స్థాయిలో నగదు బయటపడుతోంది. ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఓ అపార్టుమెంటు గదిలో రూ.కోట్ల విలువైన నోట్ల కట్టలు ఉన్నప్పటికీ ఆమె సదరు అపార్టుమెంటుకు మాత్రం రూ.11వేలు బాకీ పడినట్లు తెలిసింది. ఐపీఎస్‌ అధికారి అరున్‌ బోథ్రా బయటపెట్టిన ఈ విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘మీరేమైనా చెప్పండి. అర్పితా గారు ‘విధేయత’కు ఉదాహరణగా నిలిచి చూపించారు. ఇతర వ్యక్తికి చెందిన నగదును సొంత గదిలో దాచి పెట్టిన ఆమె.. అపార్టుమెంటు సొసైటీకి మాత్రం రూ.11,809 బాకీ ఉన్నారు. ఇందుకు సంబంధించిన నోటీసు ఆమె అపార్టుమెంటు తలుపునకు అంటించారు’ అని అర్పితా ముఖర్జీని ఉద్దేశిస్తూ ఐపీఎస్‌ అధికారి అరుణ్‌ బోథ్రా వ్యంగ్యంగా పేర్కొన్నారు. నోటీసుతోపాటు ఆమె ఇంట్లో లభించిన నగదును చూపిస్తూ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తోన్న యూజర్లు.. కలియుగంలో ఇటువంటి వ్యక్తిని కలుసుకోవడం అత్యంత అరుదు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు కేవలం పవిత్రమైన మన భూభాగంలోనే చాలా అరుదుగా కనిపిస్తారని మరో యూజర్‌ సెటైర్‌ వేశారు.

ఇదిలా ఉంటే, పార్థా ఛటర్జీ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. దీనికి సంబంధించి అర్పితా ముఖర్జీ నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో రూ.కోట్లలో నోట్ల కట్టలు, బంగారం, కీలక దస్త్రాలు బయటపడుతూనే ఉన్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని