Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్‌కు కాల్స్‌..!

అమృత్‌పాల్‌ సింగ్‌ వెనుకుండి కథ నడిపిన దల్జీత్‌ సింగ్‌ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడి ఖాతాల్లోకి విదేశాల నుంచి రూ. 35 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. 

Published : 20 Mar 2023 17:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రైవేటు సైన్యం ఏర్పాటు కోసం విదేశాల నుంచి భారీగా నిధులను సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అతడి అనుచరుడిను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. అమృత్‌పాల్‌పై ఆపరేషన్‌ మొదలుపెట్టగానే పోలీసులు గురుగ్రామ్‌లో అతడి ప్రధాన అనుచరుడు దల్జిత్‌ సింగ్‌ ఖల్సీని అదుపులోకి తీసుకొన్నారు. అమృత్‌పాల్‌ తరపున ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థకు అనుబంధంగా ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ ఏర్పాటు కోసం దల్జిత్‌ తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడి ఫోన్‌ను విశ్లేషించిన అధికారులకు ఏకేఎఫ్‌ దళం గుర్రాలపై ఆయుధాలు చేతబూని ‘ఆనంద్‌పూర్‌ ఖల్సా ఫోర్స్‌’ పతాకాలతో ఉన్న వీడియోలు బయటపడ్డాయి. వారంతా తాము క్రిమినల్‌ కేసులకు భయపడం అని చెబుతుండటం వీడియోలో ఉంది. దల్జిత్‌ సింగ్‌ బ్యాంక్‌ ఖాతాల్లో గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ. 35 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. 

దల్జిత్‌ సింగ్‌ ఖల్సీ చరిత్ర మొత్తం మోసాల పుట్ట.. 

అమృత్‌పాల్‌, వారిస్‌ పంజాబ్‌ దేకు దల్జిత్‌ ప్రధాన ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దల్జిత్‌ దిల్లీలో ఓ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ నిర్వహించి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. గతంలో పలు మోసకారి పథకాలను ఇతడు నిర్వహించాడు. 2018లో తిరుమల తిరుపతి మల్టీ స్టేట్‌ కోపరేటీవ్‌ క్రెడిట్‌ సొసైటీ బోర్డు అనే సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ సంస్థ ముంబయి కేంద్రంగా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ను నిర్వహించింది. ఈ సంస్థలో ఓ డైరెక్టర్‌పై గోవాలో డ్రగ్‌రాకెట్‌ కేసు నమోదైంది. ఈ సొసైటీతో మనీ లాండరింగ్‌ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 

అంతేకాదు దల్జీత్‌ ఐకాన్స్‌ ఇన్ఫ్రాప్రాప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లలో ఒకడు. ఈ సంస్థ 2013-16 మధ్య ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయడంలో విఫలమైంది. ఈ కంపెనీని రద్దు చేయాల్సి వచ్చింది. దల్జిత్‌ ఖల్సీతో స్టెర్లింగ్‌ ఇండియా అనే సంస్థలో ఉన్న ఓ భాగస్వామి పేరుపై నమోదైన ఆడీకారును అమృత్‌పాల్‌ వినియోగించేవాడు. 

గతంలో భారత్‌కు వ్యతిరేకంగా కెనడాలోని వాంకోవర్‌లో పాకిస్థాన్‌ హైకమిషన్‌కు లేఖ సమర్పించిన ఖలిస్థాన్‌ నాయకుల బృందంలో దల్జీత్‌ కూడా ఉన్నాడు. 

అమృత్‌పాల్‌ను అప్రమత్తం చేసిన ఫ్లాగ్‌ కారు..!

సాధారణంగా అమృత్‌పాల్‌ ప్రయాణించే మార్గంలో తొలత ఓ ఫ్లాగ్‌ కారు వెళుతుంది. అక్కడ అనుకోని పరిస్థితులు ఏమైనా ఉంటే గమనించి అమృత్‌పాల్‌ డ్రైవర్‌కు సమాచారం చేరవేస్తుంది. శనివారం పోలీసులు ఆపరేషన్‌ చేపట్టి హరికే అనే ప్రాంతం వద్ద కాపుకాశారు. కానీ, అక్కడే ఓ ప్రార్థనా మందిరం వద్ద ఉన్న ధాబా సమీపంలో అమృత్‌పాల్‌ ఉన్నాడు. అతడి పైలట్‌ కారు దాదాపు 2 కిలోమీటర్ల ముందు ఉంది. ఆ కారులోని వారు పోలీసుల మోహరింపును గమనించి ‘యూ’టర్న్‌ తీసుకొని అమృత్‌పాల్‌ వద్దకు చేరుకొని సమాచారం చేరవేశారు. 

పరిస్థితిని వెంటనే అర్థం చేసుకొన్న అమృత్‌పాల్‌ మెర్సిడెస్‌ ఎస్‌యూవీ వాహనం వెంటనే యూటర్న్‌ తీసుకొంది. ఆ ఎస్‌యూవీని అక్కడే వదిలేసిన అమృత్‌పాల్‌ ఫ్లాగ్‌ కారులోనే వేరేమార్గంలో ఉడాయించాడు. ఈ కారులో అతడి డ్రైవర్‌ హరిప్రీత్‌తో సహా ఐదుగురు ఉన్నారు. అమృత్‌పాల్‌ మామ హిరిజీత్‌ సింగ్‌ కూడా దానిలో ఉన్నట్లు భావిస్తున్నారు. అతడు నేడు లొంగిపోయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు