Satyendar Jain: దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు అస్వస్థత.. జైలునుంచి ఆస్పత్రికి తరలింపు

నగదు అక్రమ చెలామణీ(Money laundering) కేసులో అరెస్టయిన దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain) అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో సోమవారం ఆయన్ను దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌...

Published : 20 Jun 2022 23:25 IST

దిల్లీ: హవాలా (Money laundering) కేసులో అరెస్టయిన దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌(Satyendar Jain) అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో సోమవారం ఆయన్ను దిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. మొదట ఆయన్ను తీహాడ్‌ జైలు(Tihar Jail) నుంచి జీబీ పంత్ వైద్యశాలకు తీసుకురాగా.. అక్కడినుంచి జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న జైన్‌ను ఈడీ(ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. 

ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన బెయిల్‌ అభ్యర్థనను నిరాకరించింది. జైన్‌ బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న స్పెషల్‌ కోర్టు.. తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేయగా ఈ మేరకు తీర్పు వెలువడింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గత నెలలో ఆయన్ను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని