Rajya Sabha: రాజ్యసభ ఎన్నికలు.. జైళ్లో ఉన్న ఎమ్మెల్యేలకు చుక్కెదురు

రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ మహారాష్ట్రలో అధికార కూటమికి చుక్కెదురైంది.

Published : 09 Jun 2022 16:46 IST

అనిల్‌ దేశ్‌ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం

ముంబయి: రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ మహారాష్ట్రలో అధికార కూటమికి చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్‌ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాష్ట్రమంత్రి నవాబ్‌ మాలిక్‌లు చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. బెయిల్‌ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో జైళ్లో ఉన్న ఇద్దరు నేతలు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో 6 రాజ్యసభ స్థానాలకు గాను జూన్‌ 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో మహావికాస్‌ అఘాడీ తరపున శివసేన రెండు, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. భాజపా కూడా మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభలో విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అయితే, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం ఉంది. 106 సభ్యులున్న భాజపాకు కూడా రెండుస్థానాలు తేలికగా గెలువగలదు. కేవలం ఆరో స్థానంలో మాత్రమే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం మహావికాస్‌ అఘాడీకి సమస్యగా మారింది.

ఇదిలాఉంటే, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జైళ్లోనే ఉన్నారు. మరో కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కూడా జైళ్లోనే ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని