Pak Terrorist : పాక్‌ ఉగ్రవాది వద్ద దిల్లీలో కీలక ప్రదేశాల సమాచారం

దిల్లీలోని స్పెషల్‌ సెల్‌ పోలీసులు నిన్న అరెస్టు చేసిన పాక్‌ ఉగ్రవాది మహద్‌ అష్రఫ్‌ భారీ ప్రణాళికతోనే దేశంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం. అతను దేశ రాజధానిలోని పలు చోట్ల రెక్కీ కూడా

Published : 14 Oct 2021 02:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  దిల్లీలోని స్పెషల్‌ సెల్‌ పోలీసులు నిన్న అరెస్టు చేసిన పాక్‌ ఉగ్రవాది మహద్‌ అష్రఫ్‌ భారీ ప్రణాళికతోనే దేశంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం. అతను దేశ రాజధానిలోని పలు చోట్ల రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పలు ప్రదేశాల చిత్రాలు కూడా అతని వద్ద ఉన్నాయి. ‘‘ఇంటరాగేషన్‌ సమయంలో 2011 దిల్లీ కోర్టు పేలుళ్ల కేసుకు సంబంధించి కీలక సమాచారం లభించింది. నిందితుడు అష్రఫ్‌ పేలుళ్లకు కోర్టు ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు అంగీకరించాడు. కాకపోతే పేలుళ్లకు పాల్పడింది.. లేనిది మాత్రం వెల్లడించలేదు. ఇది భవిష్యత్తు దర్యాప్తుకు ఉపయోగపడుతుంది’’ అని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అతడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. 

అంతేకాదు అష్రఫ్‌ ఐటీవో ప్రాంతంలోని పాత పోలీస్‌ క్వార్టర్స్‌ వద్ద, ఐస్‌బీటీ , ఎర్రకోట, ఇండియాగేట్‌ వద్ద రెక్కీలు నిర్వహించినట్ల తేలింది. వీఐపీ ప్రాంతాల్లో దాడులు చేస్తే మరణాలు తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో వాటిని లక్ష్యంగా చేసుకోలేదని నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అతను రెక్కీలు నిర్వహించిన చోట్లలో ఎక్కడ పేలుళ్లు నిర్వహించాలనుకుంటున్నాడో మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు.. గతంలో దిల్లీలో జరిగిన ఏదైనా పేలుళ్లలో భాగస్వామి అయ్యాడా అన్న విషయం వెలుగులోకి రాలేదు.  

నిన్న రాత్రి లక్ష్మీనగర్‌ ప్రాంతంలో మహద్‌ అష్రఫ్‌ను అరెస్టు చేశారు. పాక్‌ దేశస్థుడైన అష్రఫ్‌ నకిలీ పత్రాలతో భారత్‌లో గుర్తింపు కార్డులు పొంది అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. భారత్‌లోని స్లీపర్‌ సెల్స్‌లో కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఉగ్రవాది నుంచి ఒక ఏకే-47 తుపాకీ, 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్‌ గ్రనేడ్‌, రెండు పిస్టోళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని