
Jammu kashmir: నిరుత్సాహ పడొద్దు.. మనకూ టైం వస్తుంది: మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్‌లో రద్దయిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ విషయంలో పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు అధికరణలను పునరుద్ధరించే సమయం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. శుక్రవారం రాజౌరీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘వారు మనల్ని విభజించాలని అనుకుంటున్నారు. కాబట్టి.. మనమంతా ఏకం కావాలి. ప్రస్తుత జమ్మూ-కశ్మీర్ పాలనలో అవినీతి పెరిగిపోయింది. బలవంతంగా శాంతి స్థాపన సాధ్యపడదు. 2019 ఆగస్టు 5 తర్వాత స్థానిక వాతావరణం గందరగోళంగా మారింది. కానీ.. మనం నిరుత్సాహపడకూడదు. త్వరలో మన సమయం వస్తుందని నమ్ముతున్నా. అప్పుడు ఈ రెండు అధికరణలను పునరుద్ధరించడమే కాదు, తాము తప్పు చేశామని కూడా కేంద్రం చెప్పాల్సి వస్తుంది. కశ్మీర్ కోసం ఇంకా ఏం కావాలని సైతం అడుగుతుంది’ అని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయాడాన్ని వ్యతిరేకిస్తూ తన పోరాటం కొనసాగుతుందని ఇదివరకే ముఫ్తీ ప్రకటించిన విషయం తెలిసిందే.