ఉత్తరాఖండ్‌: కలవరపెడుతోన్న ‘డేంజర్‌ లేక్‌’!

ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక జల ప్రళయానికి గల కారణాలను అన్వేషించేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా హిమాలయ మంచు పర్వతాల్లో ఓ ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు....

Published : 13 Feb 2021 02:00 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక జల ప్రళయానికి గల కారణాలను అన్వేషించేందుకు ఇప్పటికే శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా హిమాలయ మంచు పర్వతాల్లో ఓ ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, సరస్సుకు సంబంధించిన మరింత సమాచారం కోసం విశ్లేషణ జరపడంతోపాటు వరద ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

మరో ప్రమాదం జరగకుండా..
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా వందల మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే, ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. దాదాపు 350 మీటర్ల పొడవు.. 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకర సరస్సు ఏర్పడినట్లు శాటిలైట్‌ చిత్రాల్లో తేలింది. ప్రస్తుతం ఆ సరస్సులో నీటిమట్టం కూడా క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇలా పెరగడం ఆందోళన కలిగించే విషయమేనని చెబుతున్నారు. మరింత మంచు కరిగి నీటిమట్టం పెరిగితే సరస్సు ఏ క్షణమైనా ఉప్పొంగి మరోసారి వరదలకు కారణమయ్యే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో వీటి నుంచి బయటపడేందుకు ప్రణాళిక రచిస్తున్నామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిపుణులు పేర్కొన్నారు.

నిపుణుల అధ్యయనం..
తాజాగా సంభవించిన ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్న నిపుణులు.. హిమానీనదం నుంచి ఓ భాగం కూలిపోవడం వల్లే జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇవి నదివైపు పయనించడంతో పాటు దారిలో భారీ బండరాళ్లు, శిథిలాలు, మట్టిని రిషిగంగా నదిలోకి నెట్టుకొచ్చినట్లు అంచనా వేస్తున్నారు. తద్వారా ప్రవాహ దారిలో ఉన్న రెండు విద్యుత్‌ కేంద్రాలు మునిగిపోయినట్లు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా గుర్తించిన ప్రమాదకర సరస్సుపై మరింత అధ్యయనం జరిపేందుకు ఇప్పటికే డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సాంకేతిక నిపుణుల బృందం ఆ ప్రదేశంలో హెలికాప్టర్‌ సాయంతో ఏరియల్‌ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి.

సరస్సుపై సమాచారం ఉంది: ముఖ్యమంత్రి

జోషిమఠ్‌లోని రైనీ గ్రామం సమీపంలో ఏర్పడ్డ సరస్సుపై ఇప్పటికే పూర్తి సమాచారం ఉందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ వెల్లడించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని, అయితే ఎలాంటి భయం మాత్రం అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైతే వైమానిక సిబ్బందిని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నామని.. వీరితో పాటు శిక్షణ పొందిన నిపుణులను ఈ ప్రదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి రావత్‌ స్పష్టంచేశారు.

భూతాపం వల్లే..
వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచు పర్వతాల్లో కరుగుదల వేగంగా జరుగుతుంది. దీనివల్ల హిమానీ నదాలపై సరస్సులు ఎక్కువగా ఏర్పడతాయి. తాజాగా ఏర్పడిన సరస్సు కూడా ఇలాంటిదే. ఈ కరుగుదల విపరీతంగా ఉన్నప్పుడు సరస్సుల్లో నీటి మట్టం చాలా వేగంగా పెరిగిపోతుంది. గట్టులా పనిచేసే పర్వతాకృతి వద్ద కూడా మంచు కరిగి, ఆ ప్రాంతం వదులుగా మారుతుంది. దీంతో ఆ ప్రాంతంలోని రాతి పెళ్లలను బద్దలుకొట్టుకుంటూ నీరు దిగువ ప్రాంతాలకు ఉరకలెత్తి వరదలకు కారణమవుతుంది.

ఇవీ చదవండి..
ఆపరేషన్‌ తపోవన్‌..ఆరో రోజు అదే ఉత్కంఠ
జల విలయం: ఆ నిర్లక్ష్యమే కొంపముంచిందా?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని