Dasanglu Pul: మాజీ సీఎం సతీమణి.. ఆ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి

అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh) చరిత్రలో తొలిసారి ఓ మహిళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

Published : 13 Jun 2024 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) ముఖ్యమంత్రిగా పెమా ఖండూ(Pema Khandu) వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దోర్జీ ఖండూ స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను నిర్వహించారు. ఈసారి ఆ రాష్ట్ర చరిత్రలో ఒక మహిళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె దొసాంగ్లు పుల్‌ (Dasanglu Pul). ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హాయులియాంగ్‌ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్‌ సతీమణి అయిన ఆమెను మద్దతుదారులు ఐరన్ లేడీ అని పిలుస్తుంటారు. భర్త మరణానంతరం ఆయన ప్రాతినిధ్యం వహించిన    ఆ స్థానంలో 2016 నుంచి ఎన్నికవుతున్నారు. అయితే ప్రస్తుత క్యాబినెట్‌లో ఆమెకు ఏ శాఖ అప్పగిస్తారో తెలియాల్సిఉంది.

మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడు పెమా ఖండూ. పెమా 2000లో కాంగ్రెస్‌లో చేరారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో పెమా వేగంగా ఎదిగారు. నబమ్‌ తుకి ప్రభుత్వం (కాంగ్రెస్‌)లో మంత్రిగా పనిచేశారు. 2016లో అరుణాచల్‌లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేశాక భాజపా మద్దతుతో ఏర్పాటైన కలిఖో పుల్‌ సర్కారులో పెమా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత పీపీఏ (People's Party of Arunachal)లో చేరిన ఆయన.. ఆ వెంటనే తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 46 సీట్లను గెల్చుకొని వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు వంటి వారు హాజరయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని