Arvind Kejriwal: దేశం కోసం.. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి..!

దేశ రాజధాని దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారులో సీబీఐ సోదాలు కలకలం రేపుతోన్న సమయంలో.. ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ మిస్డ్‌కాల్‌ ప్రచారం ప్రారంభించారు.

Updated : 19 Aug 2022 20:26 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారులో సీబీఐ సోదాలు కలకలం రేపుతోన్న సమయంలో.. ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ మిస్డ్‌కాల్‌ ప్రచారం ప్రారంభించారు. ఈ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ప్రజలను అభ్యర్థించారు. 

‘భారత్‌ను నంబర్‌ వన్‌గా నిలిపే జాతీయ మిషన్‌లో చేరేందుకు 9510001000కి మిస్డ్ కాల్ ఇవ్వండి. భారత్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్తాం’ అని కేజ్రీవాల్‌ వీడియో సందేశంలో వెల్లడించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా నివాసంలో నేడు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మద్యం విధానంపై దాఖలైన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. సిసోదియా నివాసంతో పాటు దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని 21 చోట్ల ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 

దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘సీబీఐని తన పని తాను చేసుకోనివ్వండి. భయపడాల్సిన పనేంలేదు. మనల్ని ఇబ్బంది పెట్టాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఆటంకాలు వస్తుంటాయి. కానీ, మన పని ఆగదు. మనీశ్‌ సిసోదియాపై తనిఖీలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. మన నేతలు అలాంటి సోదాలను ఎదుర్కొన్నారు. ఇవి మనల్ని ఆపలేవు. దేవుడు మనతో ఉన్నాడు. ఈ దాడులకు పార్టీ భయపడదు. ఈరోజే దిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ను అభినందిస్తూ అమెరికా దిగ్గజ వార్తాపత్రిక అయిన న్యూయార్క్‌ టైమ్స్‌లో మొదటిపేజీలో కథనం వచ్చింది. మనీశ్‌ సిసోదియా ఫొటోను కూడా ప్రచురించారు. కొవిడ్‌ కారణంగా సంభవించిన భారీ మరణాలు గురించి చివరిగా ఈ పత్రికలో భారత్ గురించి వార్త వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. 

సిసోదియా ఇంటివద్ద 144 సెక్షన్..

ఒకవైపు సీబీఐ దాడులు జరుగుతుంటే.. ఆప్‌ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సిసోదియాకు మద్దతుగా నివాసం బయట గుమిగూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని