Arvind Kejriwal: బాలిక హత్యాచారంపై న్యాయవిచారణకు ఆదేశిస్తాం

హత్యాచారానికి గురైనట్టుగా భావిస్తున్న తొమ్మిదేళ్ల దళిత బాలిక మరణంపై న్యాయవిచారణకు ఆదేశించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Published : 05 Aug 2021 01:48 IST

దిల్లీ: హత్యాచారానికి గురైనట్టుగా భావిస్తున్న తొమ్మిదేళ్ల దళిత బాలిక మరణంపై న్యాయవిచారణకు ఆదేశించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. బుధవారం బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన సీఎం..  చిన్నారి మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అంతకుముందు బాలిక నివాసం వద్ద వందలాది స్థానికులు ఆందోళన చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించేందుకు అక్కడికి వచ్చిన సీఎం కేజ్రీవాల్‌ను నిరసనకారులు చుట్టుముట్టి.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘మరణించిన బాలికను తిరిగి తీసుకురాలేము. బాధితురాలి కుటుంబానికి జరిగిన నష్టం పరిహారంతో  పూడ్చలేనిది. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు అందజేస్తాం. బాలిక మృతిపై న్యాయవిచారణకు ఆదేశిస్తాం. నేరస్థులకు తగిన శిక్ష పడేట్టు చేసేందుకు ప్రభుత్వం న్యాయవాదులను కూడా నియమిస్తుంది. దిల్లీలో శాంతిభద్రతలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్రం కఠిన చర్యలు చేపట్టాలి. ఈ అంశంలో వారికి తమ సహకారం అందిస్తాం. ’’ అని పేర్కొన్నారు.

దిల్లీలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం అనుమాస్పద స్థితిలో మృతి చెందింది. చిన్నారి తన ఇంటి సమీపంలోని  శ్మశానం వద్ద ఉన్న వాటర్‌ కూలర్‌ నుంచి తాగునీరు తీసుకొచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ కాటికాపరి సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక మృతిని తీవ్రంగా పరిగణిస్తూ దిల్లీ మహిళా కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ సహా పూర్తి దర్యాప్తు నివేదికను ఈ నెల 5 లోగా సమర్పించాలని పేర్కొంటూ డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని