Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ నిలిపివేత

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది.

Published : 22 Jun 2024 06:04 IST

ఈడీ వాదనలు వినే వరకు స్టే కొనసాగుతుందన్న హైకోర్టు

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల చివరి క్షణంలో నిలిచిపోయింది. ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు గురువారం ఇచ్చిన ఉత్తర్వును దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) వాదనలను తాము వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్‌ ఉపశమనంపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు జస్టిస్‌ సుధీర్‌ కుమార్‌ జైన్, జస్టిస్‌ రవీందర్‌ దుదేజా సభ్యులుగా ఉన్న సెలవుకాల ధర్మాసనం తెలిపింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వును సవాల్‌ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24కల్లా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఇరు పక్షాలకు సూచించింది. రికార్డులన్నీ పరిశీలించాల్సి ఉన్నందున తమ తీర్పును రెండు మూడు రోజులపాటు రిజర్వులో ఉంచుతున్నట్లు తెలిపింది.

అంతకుముందు.... ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎస్‌.వి.రాజు అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన ట్రయల్‌ కోర్టు ఉత్తర్వును వెంటనే నిలిపివేయాలని, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయరాదని కోరారు. ట్రయల్‌ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపించారు. గురువారం రాత్రి 8గంటల సమయంలో ట్రయల్‌ కోర్టు జడ్జి ఉత్తర్వు ఇచ్చారని, దాని ప్రతి ఇప్పటికీ తమకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా ఆ ఉత్తర్వును 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న అభ్యర్థిననూ పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు.

అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆరోపణలను కేజ్రీవాల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వి, విక్రమ్‌ చౌధరి తోసిపుచ్చారు. మంజూరైన బెయిల్‌ను రద్దు చేయడం, లేదా తిప్పిపంపించడంపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. కేజ్రీవాల్‌కు ఇప్పటికే కొద్ది రోజుల పాటు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిందని వివరించారు. బెయిల్‌ మంజూరు కేసుకు సంబంధించిన దస్త్రం తమ వద్దకు వస్తోందని, నమోదు తర్వాత విచారణ ప్రారంభిస్తామని, వాదనలు వినిపించేందుకు ఎంత సమయమైనా ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. అప్పటివరకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని