Kejriwal: సత్యేందర్‌ జైన్‌ను పరామర్శించిన కేజ్రీవాల్‌.. ‘హీరో’ని కలిశానంటూ ట్వీట్‌!

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను (Satyendar Jain) దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)  పరామర్శించారు.

Published : 28 May 2023 18:09 IST

దిల్లీ: తలకు తీవ్ర గాయం తగలడంతో ఆస్పత్రిలో చేరిన దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌తో (Satyendar Jain) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) భేటీ అయ్యారు. జైన్‌ చికిత్స పొందుతున్న ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో పరామర్శించిన కేజ్రీవాల్‌.. ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన కేజ్రీవాల్‌.. ధైర్యశాలి, హీరోతో సమావేశమయ్యానంటూ ట్వీట్‌ చేశారు. మనీలాండరింగ్‌ (Money laundering) ఆరోపణలతో గత ఏడాదిగా జైల్లో ఉంటున్న సత్యేందర్‌ జైన్‌కు ఇటీవల మధ్యంతర బెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే.

మనీలాండరింగ్‌ కేసులో గతేడాది మే లో అరెస్టై తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న సత్యేందర్‌ జైన్.. ఇటీవల జైలులోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన తల, చేతులకు గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన జైలు అధికారులు.. ఆయన్ను దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ (Lok Nayak Hospital) ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స పొందించారు. అయితే, తలకు, చేతికి కట్లతో జైన్‌ కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు కొంతకాలంగా జైన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్‌ఆద్మీతోపాటు ఆయన కుటుంబం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల బెయిల్‌ పిటిషన్‌ విచారణ సమయంలో ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. జైల్లో ఉన్న సమయంలో జైన్‌ 35కిలోల బరువు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో జైన్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని