Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్‌

మంత్రులు, 10 ఎమ్మెల్యేలు సహా రాజ్‌భవన్‌కు రావాలని ఎల్జీ కార్యాలయం సీఎం కేజ్రీవాల్‌ను ఆహ్వానించింది. అయితే, కేజ్రీవాల్‌ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.

Published : 27 Jan 2023 01:28 IST

దిల్లీ: దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా (VK Saxena) మధ్య అభిప్రాయ భేదాలు సద్దుమణగడం లేదు. ఇటీవల సక్సేనాను కలిసేందుకు కేజ్రీవాల్‌ అనుమతి కోరగా ఆయన పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రులు, 10 ఎమ్మెల్యేలతో శుక్రవారం రాజ్‌భవన్‌కు రావాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం సీఎంఓకు లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్‌ ఎల్‌జీని కలిసేందుకు నిరాకరించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆ రోజున పంజాబ్‌ వెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘‘ థ్యాంక్యూ ఎల్‌జీ సార్‌.. రేపు పంజాబ్‌ వెళ్తున్నందున మిమ్మల్ని కలవడం కుదరడం లేదు. మీతో సమావేశమయ్యేందుకు మరో రోజున అనుమతించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం కార్యాలయం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది.

2013లో అర్వింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. ఇటీవల 30 మంది ఉపాధ్యాయుల బృందాన్ని ప్రత్యేక శిక్షణ కోసం ఫిన్లాండ్‌ పంపాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, దీనిని ఎల్‌జీ వ్యతిరేకించారు. దీంతో జనవరి 16న ఆయన ఇంటి ఎదుట ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇది దిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, దిల్లీ ప్రజలు కడుతున్న పన్నులను విద్య కోసం ఖర్చు చేస్తుంటే ఎల్‌జీకి సమస్య ఏంటని అర్వింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎల్‌జీని కలిసేందుకు అనుమతి కోరినా అధికారులు నిరాకరించారు. ఇంతమందితో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చెయ్యలేదని, సమయం చూసి చర్చించుకుందామని అదే రోజు సాయంత్రం ఎల్జీ సక్సేనా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది. కానీ, సక్సేనా పిలుపును కేజ్రీవాల్‌ తిరస్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు