Delhi Liquor Scam: కేజ్రీవాలే కీలక కుట్రదారు

మద్యం కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్‌ స్వయంగా వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆ నిధులతోనే గోవాలోని విలాసవంతమైన హోటల్‌లో బస చేశారని పేర్కొంది.

Updated : 11 Jul 2024 03:59 IST

మంత్రివర్గ ఉప సంఘం కట్టుకథే
నేతలు, వ్యాపారవేత్తలు రూ.100 కోట్లు ఇచ్చారు
అభియోగపత్రంలో ఈడీ ఆరోపణ

దిల్లీ: మద్యం కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్‌ స్వయంగా వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆ నిధులతోనే గోవాలోని విలాసవంతమైన హోటల్‌లో బస చేశారని పేర్కొంది. ఈ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది. మద్యం విధానంపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేశామని కేజ్రీవాల్‌ చెప్పడం కట్టుకథని స్పష్టం చేసింది. బుధవారం పీఎంఎల్‌ఏ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంది. 12వ తేదీన కేజ్రీవాల్‌ను హాజరుపరచాలంటూ ప్రొడక్షన్‌ వారెంట్‌ను జారీ చేసింది. ఈడీ 209 పేజీలో అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో కేజ్రీవాల్‌ను కీలక కుట్రదారుగా పేర్కొంది. ‘గోవాలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బస చేశారు. ఈ బిల్లును కేసులో నిందితుడైన చన్‌ప్రీత్‌ సింగ్‌ చెల్లించారు. సౌత్‌ గ్రూప్‌తోపాటు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఈ కేసులో రూ.100 కోట్ల ముడుపులిచ్చారు. ఇందులో రూ.45 కోట్లను గోవాలో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్‌ వినియోగించుకుంది. ఈ వివరాలను ఎన్నికల సంఘానికీ తెలియజేయలేదు. ప్రతి దశలో ఈ రూ.100 కోట్లపై కేజ్రీవాల్‌ నియంత్రణ కలిగి ఉన్నారు. నిధుల సేకరణ, కలిగి ఉండటం, బదిలీ చేయడం.. ఇలా ప్రతి విషయంలోనూ కేజ్రీవాల్‌ కుట్ర ఉంది. అందుకే మనీ లాండరింగ్‌ కేసులో ఆయన శిక్షకు అర్హుడు. విచారణ సందర్భంగా 11 సార్లు ఆయన స్టేట్‌మెంటును రికార్డు చేశారు. అయితే ఆయన ఏనాడూ సరైన సమాధానమివ్వలేదు. విషయాలను దాయడానికి ప్రయత్నించారు. తనవద్ద ఉన్న ఫోన్ల పాస్‌వర్డ్‌లను ఇవ్వొద్దని తన లాయర్లు చెప్పారని తెలిపారు. దిల్లీ నుంచి గోవాకు రూ.25.5 కోట్లను వినోద్‌ చౌహాన్‌ అనే మరో నిందితుడి ద్వారా బదిలీ చేశారు. అతడే దిల్లీ జల్‌ బోర్డులో బదిలీలకు బాధ్యుడు. ఈ కుంభకోణంలో విజయ్‌ నాయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఎల్‌1గా ఉన్న మద్యం వ్యాపారులు ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో పంజాబ్‌లో వారిని ఇబ్బంది పెట్టారు. భారాస నాయకురాలు కవిత సౌత్‌ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారు. విజయ్‌ నాయర్‌ ద్వారా రూ.100 కోట్లను ఆప్‌ నేతలకు అందించారు’ అని అభియోగపత్రంలో ఈడీ వెల్లడించింది. 


ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసు

 దిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్‌ స్పష్టీకరణ

దిల్లీ: ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసులో తనను ఇరికించారని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) క్షుద్ర వేటలో బాధితుడిగా మారానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మద్యం విధాన కుంభకోణంలో తనకు ట్రయల్‌ కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడమంటే చేయని తప్పునకు సమాధి కట్టడం లాంటిదని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో సమాధానం దాఖలు చేయాల్సిందిగా కేజ్రీవాల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆయన సమాధానమిచ్చారు. ప్రత్యేక కోర్టు జడ్జి అన్నీ పరిశీలించాకే బెయిలు ఇచ్చారని, రెండు వైపులా వాదనలను ఆయన సావధానంగా విన్నాకే తీర్పు చెప్పారని హైకోర్టుకు కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ కేసులో బుధవారం జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి 11 గంటలకు తమకు కేజ్రీవాల్‌ సమాధాన అఫిడవిట్‌ అందిందని, తిరుగు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని ఈడీ కోరింది. అయితే తాము మధ్యాహ్నం ఒంటి గంటకే దానిని విచారణాధికారికి అందజేశామని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. ఇది అత్యవసర కేసని, షెడ్యూలు ప్రకారం విచారించాలని కోరారు. ఈడీ తరఫున కోర్టుకు వచ్చిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు.. తమకు రాత్రే కేజ్రీవాల్‌ సమాధానం అందిందని, కొంత సమయం కావాలని కోరారు. సమాధాన అఫిడవిట్‌ను కోర్టులో వాదించే న్యాయవాదికి అందించాలని, విచారణాధికారికి కాదని స్పష్టం చేశారు. చివరకు ఈ నెల 15వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని