Sunita Kejriwal: నా భర్త రాజకీయ కుట్రలో ఇరుక్కున్నారు: సునీత కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌ శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Published : 06 Jul 2024 18:39 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సతీమణి సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal)  శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ తన భర్తపై రాజకీయ కుట్ర జరుగుతోందని మరోసారి ఆరోపించారు. ఆ కుట్రలో ఆయన పూర్తిగా కూరుకుపోయారని అన్నారు. తప్పుడు వాంగ్మూలంతో మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు మద్దతివ్వాలని ఆమె దిల్లీ ప్రజలను కోరారు. ఎంతో నిజాయితీ పరుడైన కేజ్రీవాల్‌కు ప్రజలు మద్దతివ్వకుంటే భవిష్యత్తులో విద్యావంతులెవరూ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడరన్నారు. 

‘‘ఓ ఎన్డీయే ఎంపీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. దిల్లీలో భూమి కొనడానికి సీఎంను కలిశానని ఆ ఎంపీ  చెప్పినప్పటికీ ఈడీ సంతృప్తి చెందలేదు. అతడి కుమారుడిని కూడా అరెస్టు చేసి, ఆయనను బెదిరించారు. దీంతో ఎంపీ మాట మారుస్తూ దిల్లీ మద్యం వ్యాపారం కోసం కేజ్రీవాల్‌ని కలిశానని, అందుకోసం ఆమ్‌ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాలని సీఎం అడిగారని చెప్పారు. దీంతో ఎంపీ వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతడి కుమారుడు జైలు నుంచి విడుదలయ్యారు’’ అని సునీతా కేజ్రీవాల్‌  పేర్కొన్నారు. 

మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌పై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది. మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుతో పాటు సీబీఐ పిటిషన్‌ వేయడంతో కేజ్రీవాల్ జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ వైద్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎయిమ్స్ మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసింది. మెడికల్‌ బోర్డు దిల్లీ సీఎంకు ఆరోగ్య పరీక్షలు జరిపే సమయంలో ఆయనతో పాటు సునీత కేజ్రీవాల్‌ హాజరు కావడానికి దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శనివారం నిరాకరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని