Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు.. విచారణ నుంచి వాంఖడే ఔట్‌

ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి ఎన్‌సీబీ అధికారి వాంఖడేని తొలగించారు.

Updated : 05 Nov 2021 20:26 IST

దిల్లీ: ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేను తొలగించారు. ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణను నుంచి తప్పిస్తూ ఎన్‌సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ ముంబయి జోన్‌ ఆర్యన్‌ ఖాన్‌ కేసును విచారిస్తుండగా.. ఇకపై ఎన్‌సీబీ సెంట్రల్‌ యూనిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం  ఆరు కేసులను సెంట్రల్‌ యూనిట్‌కు బదలాయించారు. ఇకపై ఈ కేసులను ఎన్‌సీబీ అధికారి సంజయ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారించనుంది.

డ్రగ్స్‌ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గరి నుంచి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారని ఆరోపించారు. ఆయన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించారంటూ పలు ఆరోపణలు చేశారు.  ఈ సందర్భంగా వాంఖడే మతంపైనా చర్చ జరిగింది. మరోవైపు ఆర్యన్‌ఖాన్‌ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సాయీల్‌ అనే వ్యక్తి సైతం వాంఖడేపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్యన్‌ఖాన్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలన్నారని చెప్పారు. దీంతో వాంఖడే చుట్టూ వివాదాలు అలముకొన్నాయి.  ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న సమీర్‌ వాంఖడేతో పాటు మరికొందరిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్యన్‌ఖాన్‌ కేసు నుంచి వాంఖడేను తప్పించడం గమనార్హం.

నన్ను తొలగించలేదు..: వాంఖడే

ఆర్యన్‌ఖాన్‌ కేసు నుంచి తప్పించడంపై వాంఖడే స్పందిస్తూ.. ఈ కేసులో తనను తొలగించలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాల్సిందిగా తానే కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసినట్లు పేర్కొన్నారు. ఆర్యన్‌ ఖాన్‌, సమీర్‌ ఖాన్‌ (నవాబ్‌ మాలిక్‌ అల్లుడు) కేసును దిల్లీ ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. దీన్ని దిల్లీ, ముంబయి బృందాలు సమన్వయంగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నుంచి తప్పించినప్పటికీ ఎన్‌సీబీ ముంబయి జోన్‌ డైరెక్టర్‌గా వాంఖడేనే కొనసాగనున్నారు.

ఇది ఆరంభం మాత్రమే: మాలిక్‌

ఆర్యన్‌ఖాన్‌ కేసు నుంచి వాంఖడేను తప్పించడంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ స్పందించారు. కేవలం ఐదు కేసుల నుంచే కాదు.. 26 కేసులపైనా దర్యాప్తు చేయాలంటూ ట్వీట్‌ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఈ వ్యవస్థను శుభ్రం చేయడానికి చేయాల్సింది చాలా ఉందని, చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు