Sameer Wankhede: ‘ఆర్యన్‌ ఖాన్‌ కేసు’లో లంచం ఆరోపణలు.. 5 గంటలకుపైగా సీబీఐ విచారణ!

ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో లంచం డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై ఎన్‌సీబీ ముంబయి విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేను సీబీఐ శుక్రవారం విచారించింది. ఈ వ్యవహారంలో సీబీఐ ఇటీవలే వాంఖడేపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Published : 20 May 2023 21:40 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan)ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సమీర్‌ వాంఖడే (Sameer Wankhede)ను సీబీఐ విచారించింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక సీబీఐ (CBI) కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను అధికారులు దాదాపు అయిదు గంటలకుపైగా విచారించారు. సాయంత్రం 4.30 సమయంలో ఆయన కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. ఈ కేసులో ఆయన విచారణకు హాజరు కావడం ఇదే మొదటిసారి.

ఎన్‌సీబీ ముంబయి విభాగం జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాంఖడే.. 2021 అక్టోబరులో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించిన కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు వాంఖడేతోపాటు మరో నలుగురు రూ.25 కోట్లు లంచం డిమాండ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం అడ్వాన్సుగా రూ.50 లక్షలు స్వీకరించినట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. వారిపై ఇటీవల కేసు నమోదు చేసింది.

అయితే, డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ అరెస్టు చేసినందుకు ప్రతీకారంగానే తనపై సీబీఐ కేసు నమోదు చేసిందని వాంఖడే ఆరోపించారు. తనపై నమోదైన సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవల బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న బాంబే హైకోర్టు.. అతడిపై మే 22 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఈ కేసులో గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేయగా.. ఆయన హాజరుకాలేదు. శనివారం మాత్రం సీబీఐ ముందుకొచ్చారు.

మరోవైపు.. వాంఖడే లంచం ఆరోపణలపై విచారణ కోసం ఎన్‌సీబీ కూడా సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముంబయిలో ఆయనకు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని తెలిసింది. అంతేగాక, ఆయన ఐదేళ్లలో ఆరుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా.. అందుకు సంబంధించిన ఖర్చులను తప్పుగా వెల్లడించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక, డ్రగ్స్‌ పార్టీ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎన్‌సీబీ ఆ తర్వాత క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని