Aryan Khan: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్‌

బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు.

Updated : 30 Oct 2021 12:30 IST

ముంబయి: బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్‌ లభించినప్పటికీ.. విడుదల ప్రక్రియ ఆలస్యమవడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుక్‌, ఆయన సతీమణి గౌరీఖాన్‌.. ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వచ్చారు. అనంతరం ఆర్యన్‌ను తీసుకొని షారుక్‌ కుటుంబం మన్నత్‌కు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన 28 రోజుల తర్వాత ఆర్యన్‌ తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి ఉత్తర్వులను నిన్న జారీ చేసింది. కానీ, అవి సకాలంలో జైలుకు చేరలేదు. విడుదల ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆర్యన్‌ శుక్రవారం రాత్రి కూడా జైల్లో ఉండక తప్పలేదు. శనివారం ఉదయం కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన జైలు సిబ్బంది ఆర్యన్‌ను విడుదల చేశారు. 

మూడు వారాల తర్వాత..

డ్రగ్స్‌ కేసులో అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్‌ను ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆర్యన్‌ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 26న ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ మొదలుపెట్టింది. ఆర్యన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అతడితో పాటు అర్బాన్‌ ఖాన్‌, మున్మున్‌కు బెయిల్‌ ఇచ్చింది.

అయితే బెయిల్‌ మంజూరుకు న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. ఇందులో రూ.లక్ష బాండ్‌ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు. జూహీ జామీనును కోర్టు అంగీకరించింది. అనంతరం బెయిల్‌ పత్రాలను తీసుకుని షారుక్‌ న్యాయ బృందం నిన్న సాయంత్రం జైలుకు బయల్దేరినప్పటికీ అప్పటికే నిర్దిష్ట సమయం ముగిసిపోయింది. దీంతో శనివారం ఉదయానికి విడుదల ప్రక్రియ పూర్తవ్వడంతో ఆర్యన్‌ను విడుదల చేశారు. మూడు వారాలపాటు జైలులో ఉన్న ఆర్యన్‌.. నేడు జైలు నుంచి బయటకు వచ్చాడు.

మన్నత్‌కు మళ్లీ వెలుగుల కళ..

ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నాటి నుంచి షారుక్‌ కుటుంబం దిగులులో కూరుకుపోయింది. పండగలు, వేడుకలకు దూరంగా ఉంది. గౌరీఖాన్‌ అయితే కొడుకు విడుదలవ్వాలని నిత్యం పూజలు చేసినట్లు ఆమె సిబ్బంది తెలిపారు. ఆర్యన్‌ ఇంటికొచ్చేవరకు మన్నత్‌లో స్వీట్లు వండొద్దని గౌరీ ఆదేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆర్యన్‌ బెయిల్‌పై విడుదలవడంతో షారుక్‌ నివాసం మన్నత్‌లో మళ్లీ కోలాహలం నెలకొంది. నిన్న రాత్రి మన్నత్‌ను లైట్లతో అలంకరించారు. అటు ఆర్యన్‌ కోసం షారుక్‌ అభిమానులు ఈ ఉదయం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్లకార్డులు చేతబట్టి, డ్రమ్స్‌ వాయిస్తూ అతడికి స్వాగతం పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని