
Aryan Khan: బెయిల్ లభించినా.. మరో రాత్రి జైల్లోనే ఆర్యన్ ఖాన్!
ముంబయి: డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌కు బెయిల్ లభించినప్పటికీ అతడు మరో రోజు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆర్యన్ రాక కోసం షారుక్ కుటుంబం మరో రోజు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. బెయిల్ షరతులకు సంబంధించిన పత్రాలు నిర్దిష్ట సమయంలో (సాయంత్రం 5.30 గంటలలోపు) ఆర్థర్ రోడ్ జైలు అధికారులకు అందకపోవడంతో ఆర్యన్ విడుదలకు వీలులేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి కూడా అతడు జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
డ్రగ్స్ కేసులో ఆర్యన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులను న్యాయస్థానం శుక్రవారం జారీ చేసింది. మొత్తం 14 షరతులు విధిస్తూ ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చింది. ఇందులో రూ.లక్ష బాండ్ ఒకటి. ఈ బాండ్‌కు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు. కోర్టు ఉత్తర్వులను తీసుకుని షారుక్ న్యాయ బృందం జైలుకు బయల్దేరినప్పటికీ నిర్దిష్ట సమయం ముగిసిపోయింది. దీనిపై ఆర్థర్ రోడ్ జైలు అధికారి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘మాకు అందరూ సమానమే. ఎవరినీ ప్రత్యేకంగా చూడం. చట్టం ముందు అందరూ ఒకటే. బెయిల్ పత్రాల స్వీకరణకు సాయంత్రం 5.30 గంటల వరకు గడువు విధించారు. అది ముగిసిపోయింది. ఆర్యన్‌ను ఈ రోజు విడుదల చేయడం కుదరదు’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.