COVID-19: ‘అమెరికన్లు జాగ్రత్త.. యూరప్‌ నుంచి పాఠాలు నేర్చుకోండి’

కొన్నాళ్లుగా యూరప్‌వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో కొత్త కేసుల్లో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదయింది. దీంతో వచ్చే ఫిబ్రవరి నాటికి స్థానికంగా మరో 5 లక్షల మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ...

Published : 09 Nov 2021 18:30 IST

డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ రీజినల్ డైరెక్టర్‌ హెచ్చరిక!

లండన్‌: కొన్నాళ్లుగా యూరప్‌ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో కొత్త కేసుల్లో 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. దీంతో వచ్చే ఫిబ్రవరి నాటికి స్థానికంగా మరో 5 లక్షల మరణాలు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సైతం హెచ్చరించింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డా.హన్స్‌ క్లూజ్‌ ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం యూరప్‌లోని పరిస్థితులపై అమెరికన్లు కచ్చితంగా శ్రద్ధ వహించాలని సూచించారు. వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. వైరస్‌ నియంత్రణలో వ్యాక్సినేషన్, వెంటిలేషన్‌ ప్రధానమని చెప్పారు.

కఠిన నిబంధనలకు వేచి చూడకండి..

‘మరోసారి కేసుల పెరుగుదలతో యూరప్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాలుగు వారాలుగా చూస్తుంటే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య రెట్టింపు అయింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం, అదే సమయంలో నిబంధనల విషయంలో సడలింపులు ఇవ్వడంతో.. నాల్గో వేవ్‌కు దారి తీసింది’ అని డా.క్లూజ్‌ వివరించారు. కొత్త కొవిడ్‌ అవుట్‌ బ్రేక్‌కు యూరప్‌ను కేంద్రంగా అభివర్ణించారు. మహమ్మారి నియంత్రణలో వ్యాక్సిన్‌లు ‘గేమ్ ఛేంజర్’ అని.. కానీ, కేవలం అవి మాత్రమే సరిపోవన్నారు. ‘మనం వైరస్‌పై పోరు కొనసాగించాలి. మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, ఇండోర్ వెంటిలేషన్‌ తప్పనిసరి. ముఖ్యంగా పాఠశాలల్లో పాటించాలి’ అని తెలిపారు. వైరస్‌ ఉద్ధృతి పెరిగే అవకాశాలు కనిపిస్తే.. కఠిన నిబంధనలు విధించేందుకు వేచి చూడొద్దని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని