Pakistan Journalist: అన్సారీ జీ.. మరి ఇదేంటి..?

పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశానని పాక్‌ (Pakistan) జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శల దాడి కొనసాగిస్తోంది.

Published : 15 Jul 2022 18:03 IST

పాక్‌ జర్నలిస్టు వ్యవహారంపై మండిపడ్డ భాజపా

దిల్లీ: పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశానని పాక్‌ (Pakistan) జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శల దాడి కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ (Hamid Ansari) తోపాటు కాంగ్రెస్‌ పార్టీ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భారత పర్యటన సందర్భంగా అప్పటి ఉపరాష్ట్రపతితో సదరు పాకిస్థాన్‌ జర్నలిస్టు ఒకే వేదిక పంచుకున్న ఫొటోలను చూపిస్తూ కాంగ్రెస్‌పై భాజపా మరోసారి ఎదురుదాడికి దిగింది.

హమీద్‌ అన్సారీ ఆహ్వానం మేరకు తాను భారత్‌ను సందర్శించడంతోపాటు పలుమార్లు ఆయన్ను కూడా కలుసుకున్నానని పాకిస్థాన్‌ జర్నలిస్టు నుస్రత్‌ మీర్జా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో మొత్తం ఐదుసార్లు భారత్‌లో పర్యటించి, ఇక్కడ సేకరించిన సున్నితమైన సమాచారాన్ని తమ దేశ గూఢచార సంస్థ (ISI)కు చేరవేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. కాంగ్రెస్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ.. తాను ఎన్నడూ ఆ జర్నలిస్టును ఆహ్వానించలేదని పేర్కొన్నారు. తన మీద కొన్ని మాధ్యమాల్లో, భాజపా నేతలు చేస్తున్నదంతా అబద్ధపు ప్రచారమేనని పేర్కొంటూ హమీద్‌ అన్సారీ వాటిని ఖండించారు.

అయితే, కాంగ్రెస్‌తోపాటు హమీద్‌ అన్సారీ స్పందనను తోసిపుచ్చిన భాజపా అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా.. 2009లో ఉగ్రవాదంపై జరిగిన ఓ సదస్సులో ఒకే వేదికపై హమీద్‌ అన్సారీ, పాకిస్థాన్‌ జర్నలిస్టు ఉన్న ఫొటోను విడుదల చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలన్న ఆయన.. నుస్రత్‌ మీర్జాతో వేదిక పంచుకోకుండా ఉండాల్సిందని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ భాటియా.. అటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించడానికి ఇంటెలిజిన్స్‌ క్లియరెన్స్‌ అవసరమన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం, అటువంటి కార్యక్రమానికి వచ్చేవారి సమాచారం రాజ్యాంగబద్ధ సంస్థల వద్ద తప్పకుండా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి భారత్‌లో ప్రవేశించడమే కాకుండా దేశ సమగ్రతను దెబ్బతీసే ఇటువంటి వ్యవహారం సరైందని కాంగ్రెస్‌ భావిస్తోందా? అంటూ కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని