Vande Metro: ఊళ్ల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’.. రైల్వే మంత్రి కీలక ప్రకటన

నగరాలకు ఆనుకుని ఉన్న సమీప ప్రాంతాల నుంచి రాకపోకలను సులువు చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహాలో వందే మెట్రోలను తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు.

Updated : 02 Feb 2023 10:14 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో రైల్వేశాఖ (Railway Ministry)కు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేటాయింపులు చేసిన వేళ.. రైల్వే మంత్రి నుంచి కీలక ప్రకటన వెలువడింది. పెద్ద నగరాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) మినీ వెర్షన్ ‘వందే మెట్రో (Vande Metro)’ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు ఇవి వెసులుబాటుగా ఉంటాయన్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు రూ.2.42లక్షల కోట్లు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం బడ్జెట్‌ (Budget 2023) ప్రసంగంలో ప్రకటించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.లక్ష కోట్లు అధికం కావడం విశేషం. ఈ కేటాయింపుల ప్రకటన వెలువడిన కొద్ది గంటల తర్వాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) మీడియాతో మాట్లాడారు. ‘‘వందే భారత్‌ తరహాలోనే ‘వందే మెట్రో’లను కూడా అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు సత్వరం చేరుకునేలా చేయడానికి వందేభారత్‌ మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారు. వందే మెట్రో (Vande Metro)ల రూపకల్పన, తయారీ ఈ ఏడాదే పూర్తవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ రైళ్ల ఉత్పత్తిని పెంచుతాం’’ అని రైల్వే మంత్రి వెల్లడించారు.

ఇప్పుడున్న వందే భారత్‌ రైళ్లలో 16 బోగీలున్నాయి. అయితే మెట్రో రైళ్ల మాదిరిగానే ఈ వందే మెట్రోలనూ ఎనిమిది బోగీలు ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వందే మెట్రో ఎంతగానో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని