Asaduddin: చావు అంటే భయంలేదు.. ‘జడ్‌’ కేటగిరి భద్రత నాకొద్దు : అసద్‌

తనకు కేంద్ర హోంశాఖ కేటాయించిన జడ్‌ కేటగిరి భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. యూపీ ఎన్నికల .....

Updated : 04 Feb 2022 18:15 IST

దిల్లీ:  కేంద్ర హోంశాఖ తనకు జడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో మేరఠ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తుండగా ఆయన కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. దీంతో అసదుద్దీన్‌కు తక్షణమే సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో జడ్‌ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. అయితే, తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న అసద్‌.. అందరిలాగే తాను ‘ఏ కేటగిరీ’ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. 

మరోవైపు, తన వాహనంపై కాల్పుల ఘటనను లోక్‌సభలో ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా అసద్‌ మాట్లాడుతూ.. చావుకు తాను భయపడబోనన్నారు. తనకు జడ్‌ కేటగిరీ భద్రత అవసరంలేదనీ.. దాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్‌ ద్వారా సమాధానం ఇస్తారనీ.. యూపీలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వారిపై ఉపా చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు. దేశంలో పేదలు, మైనార్టీలకు భద్రత ఉంటే తనకూ ఉన్నట్టేనని చెప్పారు. దేశంలోని పేదలు బాగుంటేనే తానూ బాగుంటానన్నారు. ఇటీవల పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం అంశంపైనా తాను బలంగా ప్రశ్నించానన్నారు. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని